ఎటువంటి లాభం ఆశించకుండా, ఇతరల కోసం ఆలోచించేది, సాయం చేసేది స్నేహితులు మాత్రమే.. అలాంటి స్నేహ బంధం మనుషుల మధ్యే కాదు మూగ జీవాల మధ్య కూడా ఉంటుదని మరోసారి రుజువైంది. జాతి వైరాన్ని పక్కనపెట్టి మెదక్ జిల్లా తూప్రాన్‌లో కుక్క-పిల్లి ఒకదానితో ఒకటి ఎంతో ఆప్యాయంగా మసులుకుంటున్నాయి.
అలా దోస్తులైనయి
తూప్రాన్‌లోని జైశ్రీరాం టీ స్టాల్ వద్దకు సంవత్సరం క్రితం ఓ కుక్క పిల్ల వచ్చింది. టీ స్టాల్ యజమాని నరహరి గౌడ్.. కుక్క పిల్లకు పాలు, ఆహారం పెట్టడం వల్ల అది అక్కడే మకాం పెట్టి పెరిగి పెద్దదైంది. మూణ్నెళ్ల క్రితం ఇదే టీ స్టాల్ వద్దకు ఓ పిల్లి పిల్ల వచ్చింది. పిల్లిని చూసి తరమాల్సిన కుక్క.. విచిత్రంగా జాలి చూపించింది. మార్జాలం కూడా కాస్త ధైర్యం చేసి కుక్క వద్దకు వెళ్లింది. అలా ఆ రెండూ దోస్తులయ్యాయి.
అల్లరే అల్లరి
ఈ మార్జాలం- శునకం ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేకపోతున్నాయి. పిల్లి ఎటు పోతే అటు కుక్క అటు... కుక్క ఎటు పోతే అటూ పిల్లి రెండు కలిసి పోతున్నాయి. కలిసే ఆహారం తింటున్నాయి. మార్జాలానికి శునకమే పడకయింది.
తుంటరి పిల్లి
పిల్లి తన తుంటరి పనులతో ఎంత అల్లరి చేసినా కుక్క మాత్రం విసుగు చెందకుండా.. దాన్ని కంటికి రెప్పాలా కపాడుకుంటోంది. ఈ రెండు జంతువుల మైత్రి తూప్రాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీ స్టాల్ వద్ద ఆగినవారు... వీటి అల్లరిని తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు.
జాతి భేదం మరచి స్నేహం చేస్తున్న ఈ జంతువులు... కులం, మతం, జాతి పేరుతో ఒకరిపై ఒకరు కత్తి దూసుకునే మనుషులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
- ఇదీ చూడండి : ఆ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతహా...