సచివాలయాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. గత ఏడాది ఫిబ్రవరి 18న మంత్రిమండలి తీసుకున్న తీర్మానాన్ని ధర్మాసనం పరిశీలించింది. తెలంగాణ స్థాయికి సరిపడా అధునాతన సచివాలయాన్ని కొత్తగా నిర్మించాలని, ఒకచోట పాత సచివాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని, ఈ పనులు చేయడానికి సచివాలయాన్ని మరో ప్రాంతానికి తాత్కాలికంగా తరలించాలని రకరకాలుగా మంత్రిమండలి తీర్మానంలో పేర్కొన్నారంది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ మంత్రిమండలి నిర్ణయంలో కొత్తది నిర్మించాలని లేదంటే.. ఉన్నదానికి మార్పులు చేయాలని ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వారి నిర్ణయం తరువాత సబ్‌కమిటీని వేసిందని, ఆ కమిటీ మరో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని చెప్పిందన్నారు. పాత భవనాన్ని కూల్చి కొత్త సముదాయాన్ని నిర్మించాలని కమిటీ సూచించిందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడటంతో అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పాత భవనాలను కూల్చివేయడంపైనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదని తాము చెప్పలేదని వ్యాఖ్యానించింది. వాదనలను విన్న ధర్మాసనం విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్