తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విస్తరింపజేసేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతోంది ఆ సంస్థ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయిలో విజయ సంకల్ప శిబిరాన్ని హైదరాబాద్లోని సరూర్నగర్లో ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సార్వజనిక సభను నిర్వహించారు. ఈ సభకు 30 వేల మంది సంఘ్ కార్యకర్తలు, సానుభూతిపరులు హాజరయ్యారు.
భారీ ర్యాలీ
సభకు ముందు నాలుగు స్వయం సేవక్ సంచాలన్‌లు వేరు వేరు మార్గాల ద్వారా బయలుదేరాయి. హస్తినాపురంలోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్, వనస్థలిపురంలోని లలితా గార్డెన్స్, మన్సురాబాద్ కేబీఆర్ కన్వెన్షన్, సరూర్‌నగర్ మండల కార్యాలయం నుంచి కవాతులు ఎల్బీనగర్ ప్రధాన కూడలికి చేరుకున్నాయి. ఎల్బీనగర్ చౌరస్తా వద్ద నాలుగు ర్యాలీలు సమైక్య కవాత్‌గా సరూర్‌నగర్ సార్వజనిక సభకు బయలు దేరాయి. ఈ ర్యాలీకి మోహన్ భగవత్ ఎల్బీనగర్ వద్ద అభివాదం చేస్తూ స్వాగతం పలికారు.
స్వయం సేవక్‌లతో శారీరక ఆసనాలు
సభలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు భాజపా నేతలు మురళీధర్ రావు, రాంమాధవ్, లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాంచందర్‌రావు, తదితర ఎంపీలు హాజరయ్యారు. మోహన భగవత్ స్వయం సేవక్‌లతో శారీరక ఆసనాలు వేయించారు. ముఖ్య అతిధిగా హాజరైన పారిశ్రామిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్ రెడ్డి తొలి ప్రసంగం చేశారు.
దేశం కోసం పోరాటం
దేశ ప్రజల ఆకాంక్ష ధర్మ విజయమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కొంతమంది అందరిని దుఃఖంలో ఉంచాలని కోరుకుంటారని అన్నారు. తనతో ఉన్నదే కాకుండా ఇతరుల వద్ద ఉన్నది కావాలంటారని మండిపడ్డారు. తన కష్టంతో ఇతరులను సుఖంగా ఉంచేందుకు కొంతమంది వ్యక్తులు పోరాడుతారని.. ఇలాంటి పోరాటాలే ఆర్‌ఎస్‌ఎస్ చేస్తోందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సంఘ్ కార్యకర్తలు, సానుభూతిపరులతో కోలాహలంగా సాగిన సభ మోహన్ భగవత్ ప్రసంగంతో ముగిసింది.
ఇవీ చూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'