జనవరి రెండు నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
యువకులు, మహిళలు, పెన్షనర్లు పాల్గొనాలి
మొదటి దశ విజయవంతం చేసినట్లే రెండో దఫాను కూడా విజయవంతం చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని యువకులు, మహిళలు, పెన్షనర్లు కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని చెప్పారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
'పరిశీలినకు రాష్ట్ర స్థాయి ప్లయింగ్ స్క్వాడ్'
పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా నియమించినట్లు సీఎస్ జోషి తెలిపారు. ప్రతీ అధికారికి వివిధ జిల్లాల్లోని 12 మండలాలు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడత పల్లె ప్రగతిలో ఒక రోజు శ్రమదానానికి ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ సూచించారు. మొదటి దశ స్ఫూర్తితో రెండోదశలోనూ ప్రజలంతా పాల్గొని విజయవంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో పల్లెప్రగతి కోసం ఫ్లయింగ్స్క్వాడ్స్