స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో రెన్ లైఫ్ ల్యాబ్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ల్యాబ్స్ డైరెక్టర్లతో పాటు ఎస్బీఐకి చెందిన పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
3 ఎకరాల స్థలం తనఖా....
రెన్ లైఫ్ ల్యాబ్స్ డైరెక్టర్లు ప్రకాష్, అబ్దుల్ అజీజ్ కలిసి బెంగళూరుకు చెందిన విజయ్ రాఘవేంద్రను మరో డైరెక్టర్‌గా సృష్టించారు. విజయ్ రాఘవేంద్ర తండ్రి పేరు మీద బెంగళూరులో ఉన్న 3 ఎకరాలకుపైగా స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవాలని కుట్ర పన్నారు. ఇందుకు జానకీ శర్మ అనే టాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించారు. మొదట సైఫాబాద్ ఎస్బీఐ శాఖను సంప్రదించినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. ఫలితంగా మహబూబ్ గంజ్ శాఖను సంప్రదించి రుణం కోసం దరఖాస్తు చేసున్నారు.
3 ఎకరాల స్థలాన్ని తనఖా పెట్టి 2017లో 16 కోట్ల రూపాయల రుణం పొందారు. తర్వాత 2018 జూన్‌లో విజయ్ రాఘవేంద్ర తండ్రి చనిపోయాడని... అతని పేరు మీద తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని రెన్ లైఫ్ డైరెక్టర్లు చేసుకున్న దరఖాస్తును బ్యాంకు అంగీకరించింది. ఈ మేరకు బ్యాంకు రుణ మాఫీ చేసింది.
దర్యాప్తు చేపట్టిన సీబీఐ...
జరిగిన తతంగాన్ని గుర్తించిన విజయ్ రాఘవేంద్ర గతేడాది బ్యాంకు ఉన్నతాధికారులకు తెలుపగా... జరిగిన మోసం బయటపడింది. తన పేరు మీద రెన్ లైఫ్ ల్యాబ్స్ డైరెక్టర్లు రుణం తీసుకుని తప్పుడు పత్రాలు సమర్పించారని ఫిర్యాదు చేశాడు. అంతర్గత దర్యాప్తు చేపట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు... మోసాన్ని ధృవీకరించుకుని సీబీఐకి ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు పవన్ కుమార్, నాగేశ్వర్ శర్మ, శంకర్, ట్యాక్స్ కన్సల్టెంట్ జానకి రామ శర్మతో పాటు రెన్ లైఫ్ ల్యాబ్స్ డైరెక్టర్లపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి : సచివాలయాన్ని ఎలా కడతారు?... వివరాలివ్వండి