ఉమ్మడి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. క్రికెట్ జట్టులో 11మంది ఆటగాళ్లు ఉన్నట్లే... ఉమ్మడి జిల్లాలో 11 మున్సిపాల్టీలు ఉన్నాయి. తెరాస, కాంగ్రెస్, భాజపా జట్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రతీ ఆటగాడు తన ప్రతిభచాటుకోవాలని తపించినట్లే... ప్రతీ మున్సిపాలిటీలో పైచేయి సాదించాలనే పట్టుదల అన్ని రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. అధికార తెరాసకు కీలకమైన నేతలున్న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసా పట్టణాల్లో జెండా ఎగురవేయాలని భాజపా, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి.
ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న పార్టీలు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, చెన్నూరు మున్సిపాల్టీలపైనే తెరాస ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ మున్సిపాల్టీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, శాసనసభ్యులు జోగు రామన్న, కోనేరు కోనప్ప, బాల్క సుమన్‌కు ఎన్నికల నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా మారింది. తెరాస ఎత్తులకు కాంగ్రెస్, భాజపాలు పైఎత్తులు వేస్తుండడం క్రికెట్ మ్యాచ్‌లానే... ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా నేతలు ప్రయత్నిస్తుంటే... చేసిన అభివృద్ధే తమకు విజయం చేకూరుస్తుందని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోసం...
మూడు జట్ల మధ్య జరిగే ఆటలో విజయ బావుటా ఎగరేయాలనే తపన... అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఆటలో గెలిచి తన ప్రతిభ చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవాలని అభ్యర్థులు ఆశపడుతున్నారు. అసమ్మతి శ్రేణులను బుజ్జగిస్తూ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. జిల్లాలో ఎలాగైన తమ జెండా ఎగరేసి మ్యాన్ ఆప్ ది సిరీస్‌గా నిలవాలని పార్టీలు చేస్తున్న కసరత్తు రాజకీయ క్రీడను రసవత్తరంగా మారుస్తోంది.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు