ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన మార్చెట్టి లక్ష్మి అనారోగ్యానికి గురికావటం వల్ల బంధువులు రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా పెద్దాసుపత్రికి తరలించాలంటూ హైదరాబాద్ రిఫర్ చేశారు. పైగా అంబులెన్స్‌లో తరలించాలని సలహా ఇచ్చారు. భయభ్రాంతులకు గురైన ఆమె బంధువులు వెంటనే అంబులెన్స్‌ను మాట్లాడుకొన్నారు.
ఖాళీ సిలిండర్‌కు రూ.4వేలా?
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటం వల్ల బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రిలోనే సిబ్బందికి రూ.4వేలు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేశారు. వారికి ఆ సిబ్బంది ఖాళీ సిలిండర్‌ను ఇచ్చారు. ఇదేం తెలియని బంధువులు లక్ష్మిని హైదరాబాద్ తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆమెకు శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న నేరడిగొండ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ అది ఖాళీ ఆక్సిజన్ సిలిండరని తేలింది. అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవటం వల్ల నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా లక్ష్మి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి మృతిచెందిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఇంతజరిగిన రిమ్స్ అధికారులుగానీ, సిబ్బందిగాని అసలు పట్టించుకోకపోవడం అక్కడ వ్యవస్థీకృతమైన నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యాధిగ్రస్థురాలికి ఖాళీ సిలిండర్‌ను ఇచ్చిన సిబ్బందిపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.