హైదరాబాద్ టోలిచౌకీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలిక గత కొంత కాలంగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడింది. నాంపల్లికి చెందిన బైక్ మెకానిక్ సల్మాన్ ఖాన్ (21)ఆటలో భాగంగా ఆన్లైన్లో పరిచయమయ్యాడు. చనువు పెరిగి బాలిక ఫోన్ నెంబర్ తీసుకున్న సల్మాన్, చాటింగ్ చేయడం ప్రారంభించాడు. బాలిక వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను వాట్సప్ ద్వారా షేర్ చేయించుకున్నాడు. అనంతరం తన కోరిక తీర్చాలని బాలికను సల్మాన్ ఒత్తిడి చేశాడు. లేదంటే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడికి గురైన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీనితో సదరు బాలిక తల్లిదండ్రులు సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ మొబైల్ నెంబర్ ఆధారంగా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అతన్ని కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరినైనా ఈ విధంగా వేధించాడా అన్న కోణంలో విచారిస్తున్నట్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'