దేశ సహకార బ్యాంకులను సంస్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. దేశంలోని 1540 సహకార బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆర్బీఐ నియంత్రణలోకి వచ్చాయి. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్బీఐ నియంత్రణలో వాణిజ్య, షెడ్యూల్, జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఈ వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
ఎప్పటిలాగే
ఆర్బీఐ నిబంధనలు సహకార బ్యాంకుల బ్యాంకింగ్ వ్యవస్థకు మాత్రమే వర్తిస్తాయని జావడేకర్ తెలిపారు. సహకార రిజిస్ట్రార్ నిబంధనల ప్రకారం, సహకారం బ్యాంకుల పరిపాలనా విధానం యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోని 1540 సహకార బ్యాంకుల్లో 8.6 కోట్ల మంది తమ డబ్బును దాచుకున్నారని జావడేకర్ వెల్లడించారు. ఈ బ్యాంకుల వద్ద రూ.5 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు.
షరతులు నెరవేర్చాల్సిందే..
సహకార బ్యాంకు అధికారిగా బాధ్యతలు చేపట్టాలంటే.. అభ్యర్థులు అందుకు తగ్గ అర్హత సాధించి, కొన్ని షరతులను నెరవేర్చాల్సి ఉంటుందని జావడేకర్ అన్నారు. అలాగే సీఈఓను నియమించడానికి అనుమతిస్తామని, దీనికి సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆడిట్ జరుగుతుందని పేర్కొన్నారు.
పరిస్థితి క్షీణిస్తే
సహకార బ్యాంకులు రుణమాఫీ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని జావడేకర్ స్పష్టం చేశారు. పరిస్థితి మరింత పతనమైతే, ఈ బ్యాంకులను తన నియంత్రణలోకి తీసుకునే హక్కు ఆర్బీఐకు ఉంటుందని పేర్కొన్నారు.
అనేక సహకార బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, కానీ కొన్ని బ్యాంకుల తప్పుడు పద్ధతులు మొత్తం ఈ రంగానికే హాని చేస్తున్నాయని జావడేకర్ అభిప్రాయపడ్డారు. అందువల్ల డిపాజిటర్ల డబ్బులను కాపాడడానికే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. బ్యాంకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు బడ్జెట్లో పేర్కొంది కేంద్రం.
ఇదీ చూడండి: విధాన సమీక్షలో 'రెపో' రేటుపై ఆర్బీఐ నిర్ణయం ఏంటీ?