దేశ వృద్ధిరేటు క్షీణత, ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయం నేడు ప్రకటించనుంది ఆర్బీఐ.
రెపో నిర్ణయం ఎలా ఉండొచ్చు..
ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం, పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలతో జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోపక్క 2019 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతం వద్ద ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రధానంగా ఉల్లి, టమాటా ధరలు భారీగా పెరగటం ఇందుకు కారణం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారీ రెపో రేటులో మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
5 సార్లు 135 బేసిస్ పాయింట్లు...
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబరు మధ్య వరుసగా రేట్ల తగ్గింపు చేపట్టారు. ఈ కాలంలో మొత్తం 5 సార్లు 135 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీరేట్లను తగ్గించారు. అయితే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2019 డిసెంబరులో జరిగిన సమీక్షలో కీలక వడ్డీరేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. అయితే రెపో అత్యల్ప స్థాయిల వద్ద ఉన్న నేపథ్యంలో ఈ సారీ రెపో యథతథంగానే ఉంచొచ్చని విశ్లేషకులు అంటున్నారు.