భారతీ ఎయిర్‌టెల్ 2019-20 డిసెంబరు త్రైమాసికంలో రూ.1,035 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.20,231 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ.21,947 కోట్లకు చేరింది.
ఎయిర్‌టెల్ గత డిసెంబరులో టారిఫ్‌ల సవరణ స్వాగతించదగ్గ పరిణామం. ఇది టెలికాం పరిశ్రమ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా టారిఫ్‌లు మరింత పెంచాల్సిన అవసరం ఉంద’ని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విత్తల్ వెల్లడించారు.
భారతీ ఎయిర్‌టెల్ ఇండియా ఆదాయం 7 శాతం పెరిగి రూ.15,797 కోట్లకు చేరినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏకంగా రూ.23,045 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సవరించిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్) సంబంధించిన చట్టబద్ధమైన బకాయిల కోసం రూ.28,450 కోట్ల కేటాయింపులు చేయడం వల్లే అంత భారీగా నష్టం ప్రకటించాల్సి వచ్చింది.
ఇదీ చూడండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'కరోనా' దెబ్బ