లేమాన్ బ్రదర్స్ సంక్షోభం అమెరికాలో వచ్చింది.. ప్రపంచమంతా వణికింది. సార్స్ ముప్పు చైనాలో కనిపించింది.. అపుడూ అంతర్జాతీయంగా ప్రతికూలతలు కనిపించాయి. తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. ఇపుడూ అన్ని ఆర్థిక వ్యవస్థలూ భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రగతిపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళనలు అధికమవుతున్నాయి.
హై అలర్ట్!
ఏ విమానాశ్రయంలో చూసినా థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లే కనిపిస్తున్నాయి. అవును మరి కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రపంచమంతా అలర్ట్ అయింది. ముందు జాగ్రత్తలను గట్టిగానే చేపడుతోంది. ఒకప్పుడు సార్స్(సివియర్ అక్యూట్ రెస్పిటరేటరీ సిండ్రోమ్) ప్రబలినపుడు చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం కనిపించిందో.. అంతకు మించిన ప్రభావం ఇపుడు కనిపించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వృద్ధి రేటుపై..
2002-03లో సార్స్ వచ్చినపుడు చైనా జీడీపీ వృద్ధి రేటు 1.1-2.6 శాతం మేర తగ్గింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాల ప్రకారం 18 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇపుడు కూడా 1 శాతం వరకు చైనా ఆర్థిక వృద్ధి డీలా పడొచ్చంటున్నారు. కానీ ఇపుడు ఆ 1 శాతం నష్టం విలువ 136 బిలియన్ డాలర్లుగా అంచనా కడుతున్నారు. ఇక ఆ దేశంలో దాదాపు 3.5 కోట్ల మంది బయటకు రావడం లేదు. అంటే ఆ మేరకు మానవ వనరుల వల్ల జరిగే పనులు నిలిచిపోయాయన్నమాట. అంతే కాదు.. చైనాలో వివిధ దేశాల తయారీ కేంద్రాలు కూడా మూతపడ్డాయి. చైనా వృద్ధి డీలా పడితే కనీసం 0.2-0.4 శాతం మేర ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గవచ్చని బార్‌క్లేస్, మోర్గాన్ స్టాన్లీలు అంచనా వేస్తున్నాయి.
ముడి చమురు ధరలపై..
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనానే. కరోనా వైరస్ మొదలైన వుహాన్ నగరం కీలక చమురు, గ్యాస్ కేంద్రం. చైనా నేషనల్ కెమికల్ కార్ప్, హింగ్లి పెట్రో కెమికల్‌లు తమ కొనుగోళ్లను తగ్గించుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన జనవరిలో చమురు ధరలు 70 డాలర్లు(బారెల్‌కు)గా ఉండగా.. ఇపుడు 56 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు తగ్గితే ఇండోనేషియా వంటి చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ఖజానాకు గండి పడే అవకాశం లేకపోలేదు.
భారత్ విషయానికొస్తే..
భారత్ విషయానికొస్తే.. ఇప్పటికే 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన ఆర్థిక వ్యవస్థ.. పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ ప్రభావం ఆ చర్యలపై కొంత ప్రతికూలతలను ప్రసరింపజేయవచ్చు. ఇప్పటికే భారీ స్థాయిలో రవాణా నిలిచిపోవడంతో దిగుమతులు-ఎగుమతుల రంగం బాగా డీలా పడింది. చైనా విడిభాగాలు కానీ, ఉత్పత్తులు కానీ భారత్‌కు భారీగానే వచ్చేవి. ఇపుడు రావడం తగ్గుతుంది. ఎగుమతులు-దిగుమతులు నిలిచిపోతే ఒక సరస్సులో వేసిన రాయి వల్ల అలలు ఎలా ఒడ్డు వరకూ వ్యాపిస్తాయో అలా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం విస్తరించవచ్చు. ఇక చైనాకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ప్రయాణ పోర్టళ్ల రాబడి తగ్గుతోంది. ఓ వైపు ప్రతికూలతలు ఉన్నా.. కరోనా ప్రభావంతో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నందున దిగుమతి దేశమైన మనకు మంచి వార్తే.
అంతర్జాతీయ వ్యాపారాలపై..
- చైనాలోనే 25,000 విమానాలు రద్దు అయ్యాయి.
- చైనా గాంబ్లింగ్ కేంద్రమైన మకావు రెండు వారాల పాటు మూసివేస్తున్నారు.
- చైనాపై ఆధారపడ్డ అంతర్జాతీయ కంపెనీలు(ఆహారం, కార్లు, ఇతర వస్తువుల కొనుగోలుదార్లు) చైనా నుంచి గిరాకీ తగ్గడంతో డీలా పడ్డాయి. హ్యుందాయ్ అయితే దేశీయంగా ఉత్పత్తిని నిలిపివేసింది.
- థాయ్‌లాండ్, ఇతర ఆసియా గమ్యాలకు ప్రయాణికులు తగ్గారు. 30 శాతం విదేశీ ప్రయాణికులు తమ గ్రూపు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
- చైనాతో గట్టి అనుబంధం ఉన్న అంతర్జాతీయ చిన్న కంపెనీలు, తయారీ కంపెనీల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
- చైనా నుంచి ఫార్మా వంటి ముడి పదార్థాలను దిగుమతి చేసుకునే కంపెనీలకూ ఇబ్బందులు ఎదురుకావొచ్చు.
- అమెరికాతో వాణిజ్య అనుబంధం మెరుగుపడుతుండడంతో లోహ ధరల అంచనాలు సానుకూలంగా మారగా.. ఇపుడు డోలాయమానంలో పరిస్థితి కనిపిస్తోంది.
మన పర్యాటకంపైనా పంజా!
కరోనా వైరస్ పర్యాటకుల్ని హడలెత్తిస్తోంది. దీని ధాటికి అంతర్జాతీయ పర్యాటకమే కాదు, దేశీయంగానూ ప్రకంపనలు మొదలయ్యాయి. కరోనా మరణ మృదంగం మోగిస్తున్న చైనాకు తెలుగు రాష్ట్రాల పర్యాటకుల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. వచ్చే నెలల్లో వెళ్లాలనుకుంటున్నవాళ్లు భారీగా రద్దు చేసుకుంటున్నారు. తాజాగా.. కేరళ, ఈశాన్యాది రాష్ట్రాలకు సైతం పర్యటనలు రద్దవుతున్నాయి.
25 శాతం తగ్గిన విచారణలు: మార్చి-మే నెలల్లో వెళ్లానుకునేవారు జనవరి చివరివారం నుంచి ఫిబ్రవరిలో ప్యాకేజీల గురించి ఆరా తీస్తుంటారు. గతంతో పోలిస్తే ఇలాంటి విచారణలు 20-25శాతానికి పైగా తగ్గాయని, కరోనా వైరస్సే ఇంద]ుకు కారణమని ఓ టూర్ ఆపరేటర్ తెలిపారు. ఇటీవలే హనీమూన్‌కు కేరళ ప్యాకేజీ బుక్ చేసుకున్న చాలా జంటలు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారని వివరించారు. రూ.20,000 వరకు నష్టమొస్తున్నా భయంకొద్దీ రద్దు చేసుకుంటున్నారట. కేరళతో పాటు తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్, హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, కులూ-మనాలిపైనా ప్రభావం చూపుతోందని వారు పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయంగా శ్రీలంక: వైరస్ ప్రభావిత దేశాలకు ప్రత్యామ్నాయంగా శ్రీలంకను ఎంచుకుంటున్నారని, అక్కడికి బుకింగ్‌లపై పెద్దగా ప్రభావం లేదని హైదరాబాద్‌లో ప్రముఖ టూర్ ఆపరేటర్ వాల్మీకి హరికిషన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆధార్ ఉంటే.. పాన్‌కార్డు సులభంగా పొందవచ్చు