ఝార్ఖండ్ పలాము జిల్లా జప్లాకు చెందిన లవకుశ్ విశ్వకర్మ అనే సాధారణ పౌరుడు.. స్థానిక శాసన సభ్యుడిని కలిసేందుకు ఎముకలు కొరికే చలిలో 90 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు.
మనవి ఏమనగా..
హుసేనాబాద్ నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు కమలేశ్ కుమార్ సింగ్ను కలిసేందుకు కాలినడకన జప్లా నుంచి మేదినీ నగర్ వచ్చాడు లవకుశ్. 27 ఏళ్లుగా మూతపడి ఉన్న జప్లా సిమెంట్ కర్మాగారాన్ని పునఃప్రారంభించి, తమకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యేతో విన్నవించుకున్నాడు. మరో నాలుగు విజ్ఞప్తులనూ ఎమ్మెల్యే ముందు ఉంచాడు.
'జప్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీ.. కేవలం కర్మాగారమే కాదు. 4000 మందికి రెండు పూటల భోజనం అందించే ఉపాధికి నిలయం. పరోక్షంగా వారి కుటుంబాలతో కలిపి లక్షల మంది కడుపు నింపింది. ఐదు వినతులు చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే వీలైనంత త్వరగా నా కోరికలు తీరుస్తారని నమ్ముతున్నాను. జప్లాను త్వరగా జిల్లా చేయాలి, సిమెంట్ కర్మాగారం పునఃప్రారంభం కావాలి, ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేక వెసులుబాటులు కలిగించాలి, రైతు రుణాలు మాఫీ చేయాలి, యువకులకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలి.'
-లవకుశ్ విశ్వకర్మ
తాను చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా చెప్పేసి తిరిగి కాలినడకనే ఇంటికి చేరుకున్నాడు లవకుశ్. అలా మొత్తం ఆరు రోజులు పాదయాత్ర చేశాడు.
ఇదీ చదవండి:గిరిజన గజ్జెలకు పండగొచ్చింది