గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జాతీయ గిరిజన నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాయ్పుర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం ఉదయం పది గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఉగాండా, మాల్దీవులు, బెలారస్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల నృత్యకారుల బృందాలు ఈ ఉత్సవానికి విచ్చేస్తున్నాయి. మొత్తంగా 2,500 మందికిపైగా నృత్య కళాకారులు ఈ ఉత్సవానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ గిరిజనులు గుస్సాడీ నృత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ గిరిజనులు థింసా నృత్యాన్ని ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు.
ఈ నెల 29న రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ.20 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన బృందానికి రూ.12 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బృందానికి రూ.8 లక్షలు బహుమతిగా అందజేస్తారు.