మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా జన్మస్థానంపై కొద్ది రోజులుగా చెలరేగిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజల డిమాండ్లను అంగీకరించినట్లు తెలిపారు ఆలయ ట్రస్ట్ ప్రతినిధి, భాజపా స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ పాటిల్.
సాయి జన్మస్థల వివాద పరిష్కారానికై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబయిలో.. సాయి సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ, పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సమస్యపై సుదీర్ఘంగా చర్చించన నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. శిరిడీవాసుల డిమాండ్లను సీఎం అంగీకరించినట్లు ట్రస్ట్ నేతలు వెల్లడించారు.
" ఈ చర్చలో ఠాక్రే ప్రజల డిమాండ్లకు అంగీకరించి... మరో వివాదం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి శిరిడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. నేటితో ఈ వివాదానికి తెరపడినట్లే"
- రాధాకృష్ణ పాటిల్, ఆలయ ట్రస్ట్ ప్రతినిధి, స్థానిక భాజపా ఎమ్మెల్యే
ఈ భేటీలో మంత్రులు బాలాసాహెబ్, అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే, డీఎమ్ ముగ్లికర్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయంతో.. శిరిడీలో యథావిధిగా కార్యకలాపాలు సాగనున్నాయి.
ఇదీ వివాదం...
మహారాష్ట్ర పర్భాణీ జిల్లాలోని పాథ్రీ ప్రాంతం సాయి జన్మస్థానంగా పేర్కొంటూ.. వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఠాక్రే నిర్ణయం వల్ల.. శిరిడీలో ఆదరణ తగ్గిపోతుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పాథ్రీ సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంద్ నిర్వహించారు.
ఇదీ చూడండి : భాజపా అధ్యక్షుడిగా నడ్డా ముందున్న సవాళ్లివే