పరిశుభ్రతతో కూడిన పర్యావరణాన్ని సృష్టించేందుకు నడుం బిగించింది ఆ గ్రామం. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ నియంత్రణ దిశగా చక్కటి విధానాన్ని అవలంబిస్తోంది.
పుదుచ్చేరిలోని పిల్లైయార్కుప్పం గ్రామస్థులు ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై సమష్టి యుద్ధం ప్రకటించారు. గ్రామ కౌన్సిలర్లు, పుదుచ్చేరి పర్యావరణ విభాగంతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు.
వాడిపారేసే ప్లాస్టిక్‌కు చెక్ పెట్టే దిశగా వస్త్రం, కాగితంతో చేసిన సంచుల తయారీలో ఈ బృంద సభ్యులు శిక్షణ పొందారు.
ఈ బృందం తయారుచేసిన బ్యాగులను స్థానిక షాపులు, కిరణా దుకాణాల వారికి అందిస్తున్నారు. వీరు చేస్తోన్న కృషి ప్రజల మన్ననలు అందుకుంటోంది.
"పిల్లైయార్కుప్పం ప్లాస్టిక్ రహిత గ్రామంగా 2010లోనే గుర్తింపు పొందింది. పాలిథిన్ సంచులకు బదులుగా వస్త్ర, కాగితం బ్యాగులను వాడాలని మేం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దుకాణాల్లో ఈ బ్యాగులను అందిస్తున్నాం. వాడిపారేసే బ్యాగులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తోన్న వీటి తయారీ కోసం స్థానిక మహిళలు, యువతకు సరైన రీతిలో శిక్షణ అందించాం. ప్రస్తుతం ఈ గ్రామంలో ప్లాస్టిక్ సంచుల వినియోగం లేదు."
-సురేశ్, పర్యావరణ ఇంజినీరు, పుదుచ్చేరి
ఈ పిల్లైయార్కుప్పం గ్రామస్థుల కృషి వారి పరిసరాలను ప్లాస్టిక్ రహితం చేయడం మాత్రమే కాదు. గ్రామాన్ని ఓ పర్యటక ప్రదేశం గానూ మార్చింది.
ఇదీ చూడండి: ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో ఇక 'యోగా- బ్రేక్'