ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు 'వై -బ్రేక్' పేరుతో యోగా విరామ సమయాన్ని ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, యోగా నిపుణల సలహాల మేరకు ఐదు నిమిషాలు యోగా విరామ సమయం ఉండేలా ఆయూష్ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ప్రాథమికంగా పరిశీలించేందుకు యాక్సిస్ బ్యాంక్, టాటా కెమికల్స్ లాంటి 15 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 'వై -బ్రేక్'ను ప్రారంభించారు. వై- బ్రేక్‌లో సరళమైన యోగాసనాలు ఉంటాయి. అవి ఐదు నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఉంటాయి.
యోగా కోర్సు కాదు
వై- బ్రెక్ అనేది యోగా కోర్సు కాదు. తక్కువ సమయం ఉండేలా దీన్ని 10 మంది యోగా నిపుణులు మూడు నెలలు శ్రమించి రూపొందించారు. వ్యాయామంలో భాగంగానే దీనిని రూపకల్పన చేశారు. ఇందుకోసం యోగా భంగిమల చిత్రపటాలను కార్పొరేట్ సంస్థల్లో ప్రదర్శించాలి. ప్రస్తుతం వై- బ్రేక్ అమలు చేస్తోన్న సంస్థల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.
ప్రధానంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. వారు ఒత్తిడిని జయించేందుకు వై- బ్రేక్ ఉపయోగపడుతుంది. తద్వారా ఉత్పత్తి కూడా పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.