జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) రూపకల్పనలో భాగంగా ప్రజలను అడిగే కొన్ని ప్రశ్నలపై భాజపాయేతర రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్‌పీఆర్ మార్గదర్శకాలపై చర్చించడానికి శుక్రవారం కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జన గణన డైరెక్టర్ల సమావేశం నిర్వహించింది.
రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.బి.గుప్తా మాట్లాడుతూ ‘‘ఎన్‌పీఆర్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కష్టం. తల్లిదండ్రుల జన్మస్థలం ఏమిటన్న ప్రశ్న ఉంది. దేశంలో చాలా మందికి తాము ఎక్కడ పుట్టామో తెలియదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారో ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర అధికారులు స్పందిస్తూ ‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడం స్వచ్ఛందమే. గతంలోనూ పుట్టిన స్థలంపై ప్రశ్న ఉండేది. ప్రస్తుతం వ్యక్తుల జన్మస్థలాన్ని తల్లిదండ్రులు జన్మించిన స్థలంతో కలిపి అడుగుతున్నారు’’ అని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వివరాలు అడుగుతారని, ‘పాన్ కార్డు’ సమాచారం సేకరించబోరని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్ అధికారిక చిహ్నాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆవిష్కరించారు.
వివరాలు సేకరించేది ఉపాధ్యాయులే
కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు తొలి దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. గణకులుగా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సెలవుల ఆధారంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన గణన తెలంగాణ డైరెక్టర్ ఇలంబరిది, జన గణన రాష్ట్ర సమన్వయకర్త కిషన్, ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. బంగాల్ ఏ అధికారినీ పంపించలేదు.
తెలుగు రాష్ట్రాల్లో మేలో ప్రారంభం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో మేలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు ఉంటున్నందున వివరాల సేకరణకు ఇదే అనుకూల సమయమని భావిస్తున్నారు.
ఇదీ చూడండి : చరిత్రలో మొదటిసారి మూతపడనున్న శిరిడీ