శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహారాష్ట్ర 'మహా వికాస్ అఘాడీ' కూటమి ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పంపిన ప్రతిపాదనకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 30న 36 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించారు ఠాక్రే. శనివారం.. శాఖల కేటాయింపు దస్త్రాన్ని గవర్నర్‌కు పంపించగా ఆయన ఆమోదించారు.
మంత్రిత్వ శాఖల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకే అగ్రతాంబూలం దక్కింది. కీలక శాఖలన్నీ వీరి వద్దే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. ఎన్సీపీకే చెందిన అనిల్ దేశ్‌ముఖ్‌కు హోం శాఖ దక్కింది. ముందుగా అజిత్ హోం బాధ్యతలు చేపడుతారని ఊహాగానాలు వినిపించినా అధిష్ఠానం.. అనిల్ వైపే మొగ్గుచూపింది.
ఇదీ చూడండి: 'మహా' విస్తరణ: ఆదిత్యకు కేబినెట్.. పవార్‌కు డిప్యూటీ
కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరఠ్కు రెవెన్యూ దక్కగా.. ప్రజా పనుల మంత్రిత్వ విభాగాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ చూడనున్నారు.
శివసేన నుంచి ఏక్నాథ్ శిందేకు పట్టణాభివృద్ధి, సుభాశ్ దేశాయ్‌కు పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాష శాఖలు కేటాయించారు.
ఆదిత్యకు పర్యటకం...
ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల్లో గెలిచి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆదిత్య ఠాక్రే.. పర్యటకం, పర్యావరణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూడనున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడిగానే కాకుండా యువసేన అధినేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆదిత్య.
ఎవరికీ కేటాయించని సాధారణ పరిపాలన, ఐటీ, ప్రజా సంబంధాలు ఇతర శాఖలను ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఇదీ చూడండి: 'మహా' పదవుల పంపకాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి!