మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. ఊహాగానాలను నిజం చేస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఆదిత్యకు కేబినెట్‌లో చోటు దక్కింది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 36 మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధనుంజయ్ ముండే, దిలీప్ పాటిల్, విజయ్ వాడెత్తివార్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది కేబినెట్, నలుగురు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి 8 మందికి కేబినెట్ పదవి.. ఇద్దరికి సహాయ మంత్రి పదవి దక్కింది. శివసేన నుంచి 8 మంది మంత్రులు, నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం విధాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.
వారసుడి ఆగమనం..
ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు. ఆయనే సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య. అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి గెలిచిన ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్యను కేబినెట్‌లో తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేటి మంత్రి వర్గ విస్తరణలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
అజిత్ స్థానం పదిలం..
మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్ పవార్.. గతంలో దేవేంద్ర ఫడణవీస్ మూడు రోజుల ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పవార్ కుటుంబసభ్యుల ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
అయితే, ఆ తర్వాత అజిత్ భవితవ్యంపై అనేక నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన్ను సంకీర్ణ మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నదానిపై తెరవెనుక పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి కోసం ఎన్సీపీ.. అజిత్ వైపే మొగ్గుచూపినట్లు కొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ.. మహా వికాస్ ఆఘాడీ కూటమి ఉపముఖ్యమంత్రి పగ్గాలను అజిత్‌కు అప్పజెప్పింది.