మానవాళికి ప్రాణాంతకరంగా మారే అవకాశమున్న అంతు చిక్కని వైరస్ ఒకటి తాజాగా వెలుగుచూసింది. చైనాలో తొలిసారిగా బయటపడ్డ ఈ వైరస్.. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సూక్ష్మజీవి ఎక్కడి నుంచి వస్తోంది? మానవ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తోంది? అనే అంశాలు ఇప్పటికీ చిక్కు ప్రశ్నలుగానే ఉన్నాయి.
కరోనా వైరస్ మూలాలు...
కరోనా వైరస్‌గా పిలుస్తున్న తాజా సూక్ష్మజీవి వ్యాప్తికి చైనాలోని ఉహన్ నగరం ప్రధాన కేంద్రంగా ఉందని భావిస్తున్నారు. 2002-03 మధ్య చైనాలో 349 మంది, హాంకాంగ్‌లో 299 మంది మరణాలకు కారణమైన 'సార్స్'(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) సూక్ష్మజీవి జాతికి చెందిన వైరస్ ఇది.
41 మందికి సోకిన కరోనా...
శ్వాసకోశ సంబంధిత ఆరోగ్యాన్ని 'కరోనా' తీవ్రంగా దెబ్బతీస్తుంది. చైనాలో ఇప్పటి వరకు 41 మందికి అది సోకింది. వారిలో ఇద్దరిని బలి తీసుకుంది. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 12 మంది మాత్రం కోలుకున్నారు.
జపాన్, థాయిలాండ్‌లోనూ...
ఉహన్లో పర్యటించి తిరిగి స్వదేశానికి చేరుకున్న ఇద్దరు థాయిలాండ్ వాసులు, జపాన్‌కు చెందిన మరో వ్యక్తి కూడా వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.
ఎక్కడ నుంచి వ్యాప్తి చెందింది?
స్పష్టంగా తెలియదు. ఉహన్లో సముద్రపు ఆహారాన్ని విక్రయించే ఓ మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.
ఎలా సోకుతోంది?
ప్రస్తుతానికి గుర్తించలేదు. ఈ వైరస్ ఒకరి నుంచి మరోకరికి సోకుతుందా? ఇతర వాహకాల ద్వారా వ్యాపిస్తుందా? అన్నదానిపై స్పష్టత లేదు.
వైరస్ సోకితే..?
- తొలుత జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
- తీవ్రమైన న్యూమోనియా వచ్చే అవకాశముంది.
భారత్ అప్రమత్తం...
థాయిలాండ్, జపాన్‌లలోనూ వైరస్ జాడ బయటపడటం వల్ల భారత్ అప్రమత్తమైంది. చైనాకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు చైనాకు వెళ్లే వారికి తగు సూచనలు చేసింది.
సూచనలు...
- చైనాకు వెళ్లే వారు పశు పోషణ కేంద్రాలను సందర్శించకూడదు. కబేళాలకు వెళ్లకూడదు.
- పచ్చి మాంసం, ఉడకని మాంసం తినకూడదు.
- దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలి.
- శ్వాసకోశ సంబంధిత సమస్యలుంటే తప్పసరిగా మాస్క్‌లు ధరించాలి.
స్కానర్లతో పరీక్షలు..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి దిల్లీ, ముంబయి, కోల్‌కతా విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను ప్రత్యేకమైన థర్మల్ స్కానర్లతో పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని...
కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించే సరికొత్త పరీక్షను తాము అభివృద్ధి చేసినట్లు జర్మన్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తల బృందం తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం దాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపింది.