త్రిదళాధిపతి బిపిన్ రావత్ నేతృత్వంలోని సీడీఎస్ విభాగానికి 40 మందిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విభాగంలోకి ఇద్దరు ఉమ్మడి కార్యదర్శులు, 13 మంది డిప్యూటీ కార్యదర్శులు, 25 మంది అండర్ సెక్రటరీ ర్యాంక్ అధికారులు రానున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీడీఎస్‌కు అన్నివిధాల సహాయం చేయటం కోసం వీరిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్రివిధ దళాలను బలోపేతం చేయటానికి వీరు తోడ్పడతారన్నారు.
తొలి త్రిదళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు దళాలను మరింత సమన్యయం చేయడానికి ముఖ్య అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1న తొలి సీడీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు రావత్. ఈ బాధ్యతలతో పాటు.. త్రిదళాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ రక్షణ మంత్రికి సైనిక సలహాదారుడిగానూ వ్యవహరిస్తున్నారు.
రక్షణశాఖకు కేటాయించిన బడ్జెట్ సరైన రీతిలో వినియోగించటానికి, మూడు విభాగాలపై ఉమ్మడి ప్రణాళిక, శిక్షణ, కార్యకలాపాలను మరింత బలోపేతం చేయటానికి సీడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. మూడు విభాగాలకు చెందిన ఆయుధాలు, పరికరాలను స్వదేశీకరించటానికి తీసుకోవలసిన చర్యలపై కీలక పాత్ర పోషించనున్నారు సీడీఎస్.
ఇదీ చూడండి:కారు నుంచి రోడ్డుపై పడిన చిన్నారి..తప్పిన ప్రమాదం