భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం ముద్రిస్తే రూపాయి పరిస్థితి మెరుగుపడే అవకాశముందని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలో 'స్వామి వివేకానంద వాక్యానుమాల'లో ఉపన్యాసం పూర్తి చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండోనేసియా కరెన్సీపై గణేశుని చిత్రం ముద్రించడాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు.
"ఈ ప్రశ్నకు ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే సమాధానం ఇవ్వగలరు. నేను మాత్రం దీనికి అనుకూలంగా ఉన్నా. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడు. అయితే భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం ఉంటే రూపాయి విలువ మెరుగుపడే అవకాశం ఉంది. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను."- సుబ్రహ్మణ్యస్వామి, భాజపా ఎంపీ.
మహాత్మా గాంధీ కోరుకున్నదే..
పౌరసత్వ చట్టంలో అభ్యంతరకరమైనది ఏమీ లేదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు.
"సీఏఏను మహాత్మా గాంధీ, కాంగ్రెస్ కోరుకున్నాయి. 2003లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా దీని గురించి అభ్యర్థించారు. దానిని మేము సాకారం చేశాం. కానీ ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. పాకిస్థానీ ముస్లింలకు అన్యాయం చేసినట్లు ఆరోపిస్తోంది. అయితే అన్యాయం ఎలా జరిగింది? పాకిస్థానీ ముస్లింలు భారత్కు రావడానికి ఇష్టపడరు. మేమూ వారిని బలవంతం చేయలేము."- సుబ్రహ్మణ్యస్వామి, భాజపా ఎంపీ
యూనిఫాం సివిల్కోడ్
భాజపా త్వరలోనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ప్రవేశపెట్టనుందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. 44వ రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇది చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
2025 నాటికి చైనాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరిస్తుందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: భారత మార్కెట్లోకి ఆడి క్యూ8