డిజిటల్ ఇండియాలో భాగంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దిల్లీ కేషోపుర్ ఉద్యాన నిర్వాహకులు. అందులో నాటిన మొక్కలకు భారతీయ శాస్త్రవేత్తల పేర్లతో నామకరణం చేశారు. ఆ మొక్కలపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కోడ్‌ను స్కాన్‌చేయడం వల్ల సదరు శాస్త్రవేత్త పూర్తి వివరాలు మనకు లభిస్తాయి.
ఈ కార్యక్రమాన్ని కేషోపుర్ కార్పొరేషన్ కౌన్సిలర్ స్వేత్ సైనీ.. ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఫలితంగా భారతదేశంలోనే తొలి వైజ్ఞానికుల ఉద్యానంగా పేరు సంపాదించింది. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఈ ఉద్యానాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మోదీ 69 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా 69 మొక్కలను నాటారు.
ఏటా ఒక మొక్క
ఇక మీద మోదీ ప్రతి పుట్టిన రోజున ఈ శాస్త్రీయ ఉద్యానంలో ఓ మొక్కను నాటాలని నిర్ణయించారు. అలా నాటిన ప్రతి మొక్కపై బార్‌కోడ్‌ను అమర్చి... ఓ భారతీయ శాస్త్రవేత్తకు అంకితమిస్తారు. భారతీయ శాస్త్రవేత్తల గురించి ప్రజలు తెలుసుకునేందుకు, డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : పాక్-చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో 'విక్రమాదిత్య' మోహరింపు