చైనాలో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానం పంపింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్ ఇండియా బీ747 విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి వుహాన్ బయల్దేరింది. హుబే ప్రావిన్స్‌లో సుమారు 600 మందికి పైగా భారతీయులు ఉన్నారు.
డబుల్ డెక్కర్ విమానం..
423 మంది ఒకేసారి ప్రయాణించగలిగే ఎయిర్ ఇండియా డబుల్ డెక్కర్ విమానాన్ని ముంబయి నుంచి ఉదయమే ప్రత్యేకంగా తెప్పించారు. వుహాన్‌లో 2 నుంచి 3 గంటలు ఉండి రేపటి లోపు మనోళ్లను సురక్షితంగా భారత్‌కు తీసుకురానుంది.
ఈ విమానంలో ఐదుగురు వైద్యుల బృందం, ఒక పారా మెడికల్ బృందాన్ని పంపిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అవసరమైన మాస్కులు, వైద్య పరికరాలను అందుబాయులో ఉంచినట్లు పేర్కొంది.
విమానం బయలుదేరే ముందు సిబ్బందితో కలిసి మాట్లాడారు ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహాని.
"జాతీయ విపత్తుల సమయంలో దేశానికి అండగా ఉండేందుకు ఎయిర్ ఇండియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా ముందుకొస్తుంది. వైద్యుల బృందంతో పాటు పైలట్లు, ప్రత్యేక సిబ్బంది ఈ విమానంలో వెళ్తున్నారు. చైనాలో ఈ విమానాలకు ప్రత్యేక ఏజెన్సీ లేమీ లేవు కాబట్టి మనమే జాగ్రత్త వహించాలి."
-అశ్వని లోహాని, ఎయిర్ ఇండియా సీఎండీ
సాధారణ విమానాల తరహాలో ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించమని స్పష్టంచేశారు అశ్వని లోహాని. తిరిగి వచ్చేవారికి అవసరమైన ఆహారాన్ని సీట్ల వద్దే ప్యాకెట్లలో ఉంచుతామని, అసలు సిబ్బందితో వారు మాట్లాడాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.