రాజస్థాన్ పేరు వింటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఎడారి, అక్కడ నివసించే ఒంటెలు. అయితే ప్రతి ఏటా వచ్చే పలు పర్వదినాలు, కార్యక్రమాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది బికనీర్లో జరిగే 'ఒంటెల పండగ'.
గత 27 ఏళ్ల నుంచి అంగరంగ వైభవంగా జరిగే ఈ పండగ ఈ శనివారమే ప్రారంభమైంది. డాక్టర్ కరాని సింగ్ స్టేడియంలో జరిగే ఈ ఉత్సవాలు రెండు రోజుల అనంతరం సోమవారం ముగియనున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక, భాషా, వారసత్వానికి ప్రతీక ఈ ఒంటెల పండగ. అందుకే ఈ ఉత్సవాన్ని కళ్లారా చూసేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులూ భారీగా తరలివస్తారు.
ఇలా జరుగుతాయి
ఈ పండగలో భాగంగా స్థానికులు తమ ఒంటెలను అందంగా ముస్తాబు చేసి వాటి చేత విన్యాసాలు చేయిస్తుంటారు. దేశ భక్తి, జానపద గీతాలను ఆలపిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వదేశీ, విదేశీ పర్యటకులతో పాటు స్థానికులు మనసారా ఆస్వాదిస్తూ ఉల్లాసంగా గడుపుతారు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే... ఒంటె శరీరాలపై ఉన్న రోమాలను చూపరులను ఆకర్షించేలా రకరకాల ఆకృతులలో తీర్చిదిద్దుతారు.
"ఇటువంటి పండగను చూడటం ఇదే మొదటిసారి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి పండగ మా దేశంలో ఎన్నడూ చూడలేదు. భారత దేశం, రాజస్థాన్ ప్రజల సంస్కృతిని చూడటం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నాను."
-విదేశీ పర్యటకురాలు.
ఇలా ప్రారంభించారు
ఈ కార్యక్రమాన్ని... మొదటగా జునాఘడ్ అనే ప్రాంతం నుంచి డోలు వాద్యాలు వాయించుకుంటూ స్థానికులు తమ తమ ఒంటెలను ఊరేగించుకుంటూ కరానీ సింగ్ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం రాజస్థానీ గీతాన్ని ఆలపిస్తూ తెల్లపావురాలను, బుడగలను గాల్లోకి ఎగరేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండగ సంప్రదాయ పాటను ఆలపిస్తూ అతిథులు, పర్యటకులను ఆహ్వానించారు. ప్రతిఏటా ఇదే పద్ధతిలోనే ఒంటెల పండగ నిర్వహిస్తారు.
ఇదీ చూడండి : సీఏఏపై యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు: మోదీ