విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రియ విద్యాలయం - 1లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజంలో విద్యార్థులు ఒత్తిడితో కూడిన విద్యను నేర్చుకుంటున్నారని.. తద్వారా వారు యాంత్రికంగా తయారవుతారని కేంద్రీయ విద్యాలయం - 1 ఇంఛార్జీ ప్రిన్సిపల్ యం.వి.రావు అన్నారు. తమ పాఠశాలలో పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందించటమే తమ ధ్యేయమన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గుతున్నాయన్నారు. చిన్నచిన్న కుటుంబాల్లో తాతయ్య, అమ్మమ్మలతో పేరెంట్స్‌కి దూరంగా జీవిస్తున్నారన్నారు. ఉమ్మడి కుటుంబంలో నానమ్మలు, తాతయ్యల అవసరాన్ని తల్లిదండ్రులు బాల్యంలోనే విద్యార్థులకు తెలియచేయాలని కోరారు. పిల్లలు వారి తాతయ్య, నాన్నమ్మల ప్రేమలో గడపలేకపోవడం వల్ల నైతికవిలువలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకే తమ పాఠశాలలో కుటుంబ వ్యవస్థ గురించి తెలియ చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనమరాళ్ళతో కొద్దిసేపు సరదాగా గడిపారు. పిల్లలు వారందరికీ పాద పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసి తాతయ్యలు, నాన్నమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: