పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుని శాసనమండలి సమావేశాల్లో ఎలాగైనా గట్టెక్కించాలని వైకాపా సర్కార్ భావిస్తోంది. అయితే సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున వ్యూహాలను సిద్ధం చేసింది. మండలిలో మొత్తం 58 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ప్రతిపక్ష తెదేపాకు 34 మంది సభ్యుల బలం ఉంది. అధికార వైకాపాకు కేవలం 9 మంది సభ్యులే ఉన్నారు. పీడీఎఫ్‌కు చెందిన ఆరుగురు సభ్యులతో పాటు భాజపాకు చెందిన ఇద్దరు, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కరు, మూడు రాజధానులకు వ్యతిరేకంగానే నిలబడనుండటంతో అధికార పార్టీ బిల్లును గట్టెక్కించుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. ముగ్గురు స్వతంత్రులు ఎటువైపు మొగ్గుతారో చూడాలి. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
వైకాపా సమాలోచనలు
పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆర్థిక బిల్లు కాదు కనుక... శాసన మండలి దీన్ని సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తే చట్టంగా మారుతుంది. అయితే ఈ ప్రక్రియలో మూడు నెలలు ఆలస్యమవుతుంది. ఈలోగా ఆర్డినెన్స్ తెచ్చుకోవచ్చనే ఆలోచన కొందరు వైకాపా నేతల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం మంత్రులంతా మండలికి వెళ్లి కూర్చుని.... మూజువాణి ఓటుతో ఆమోదింపజేయాలని యోచిస్తున్నారు. మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, సభా వ్యవహారాలశాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరు ఎమ్మెల్సీలు సోమవారం సాయంత్రం నుంచి దీనిపై సమాలోచనలు చేస్తున్నారు.
వ్యతిరేకిస్తాం
శాసనమండలిలో కచ్చితంగా పాలనా వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించి తీరుతామని ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాని విధానాన్ని రాష్ట్రంలో అమలుచేసేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం