విజయవాడ బెంజ్ సర్కిల్లో చంద్రబాబు సహా పలువురు నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును 'అమరావతి పరిరక్షణ సమితి(ఐకాస)' ఖండించింది. అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఐకాస నేతలు... వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారి పట్ల పోలీసుల చర్యలు సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి ఐకాస సమావేశాలు జరుగుతాయని తెలిపారు. కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు ఐకాస సమావేశాల్లో పాల్గొంటామని వెల్లడించారు. ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఇది కులాల - పొలాల పోరాటం కాదని అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఏపీలో చీకటి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇది 29 గ్రామాల కోసం జరుగుతున్న ఆందోళన కాదని... జగన్కు, జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వారు వ్యాఖ్యానించారు. అరెస్టులతో ఏ ఉద్యమాన్ని అణచలేరని వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం:చంద్రబాబును విడిచిపెట్టిన పోలీసులు