జనసేన పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి సమస్యల అధ్యయనమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో లోక్‌సభల వారీగా పార్టీ నేతలతో ఇవాళ చర్చలు జరపనున్న పవన్... సీమ జిల్లాల్లో పార్టీ అవలంభించాల్సిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా... ఉదయం పదిగంటలకు తెలుగు భాషా పరిరక్షణపై సాహితీ వేత్తలు, భాషాకోవిదులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. మాతృభాష పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అవలంభించాల్సిన విధానాలు, అమ్మభాషను కాపాడుకోవటానికి ఏర్పాటు చేసుకోవాల్సిన లక్ష్యాలపై జనసేన అధినేత చర్చించనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై దిశానిర్దేశం
ఉదయం 11 గంటలకు రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించనున్న పవన్...తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో భేటీ కానున్నారు. పార్టీ ఓటమికి సంబంధించిన కారణాలను విశ్లేషిస్తూనే..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొన్ని నెలలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా...జిల్లాలోని పడమటి మండలాల్లో కొనసాగుతోన్న నీటి సమస్యను నేతలు...పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా శ్రేణులు అవలంభించాల్సిన విధివిధానాలపైనా నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాత్రికి నగరంలోని వైద్యులతో సమావేశం కానున్న జనసేనాని... స్థానికంగా నెలకొన్న సమస్యలపై మాట్లాడనున్నారు.
రేపు తిరుపతిలోనే కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. బుధ, గురువారాల్లో మదనపల్లె, హార్స్ లీ హిర్స్లో పర్యటించి... అక్కడే పడమటి మండలాల రైతులు, అనంతపురం, హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో భేటీ కానున్నారు. మొత్తం మీద రాయలసీమ జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా...చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల పాటు జనసేనాని పర్యటన సాగనుంది.
ఇదీ చదవండీ: