రాయలసీమ పర్యటనలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సమస్యలపై పోరాడటానికి చదువు ఉపయోగపడాలని పవన్ వ్యాఖ్యానించారు. ఆశయం కోసం పని చేసే వారికి గెలుపోటములతో సంబంధం లేదన్నారు. తాము ఓడిపోయినా... ఎక్కడికి వెళ్లినా.. కార్యకర్తలు ఆదరిస్తున్నారని పవన్ తెలిపారు. పంట పండించే రైతు ఆనందంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రైతు కడుపు కోత తీరాలన్నారు.
అలా అయితేనే సీఎం అని పిలుస్తా..
'జగన్ రెడ్డి సీఎంలాగా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంబోధిస్తా. కొంతమందికే సీఎంలాగా ప్రవర్తిస్తే... నేను పేరుపెట్టే పిలుస్తా. రాయలసీమ బాగు కోరే వ్యక్తి అయితే... ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు అడగలేదు. రాయలసీమకు అణుశుద్ధి కర్మాగారం అవసరమా..?. భయపెట్టినందువల్లే జనసేనకు ఓటు వేయలేక పోయామని కార్యకర్తలు అంటున్నారు.' అని పవన్ వైకాపాను విమర్శించారు.
ఫ్యాక్షన్ సీమ కాదు.. చదువుల సీమ...
రైతుల సమస్యల గురించి ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్లు పవన్ తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైకాపాకు లేదని విమర్శించారు. భారతి సిమెంట్ పరిశ్రమ మీద ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమ మీద ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ఫ్యాక్షన్ సీమ కాదు, చదువుల సీమ అని వ్యాఖ్యానించారు. సిమెంట్ పరిశ్రమలు పెట్టుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని విమర్శించారు. జ్ఞానమనే సంపదతో పిరికితనాన్ని చంపేస్తున్నానని పవన్ తెలిపారు.
వాళ్ల పతనం మెుదలైంది
రాజకీయ నాయకులకు ఆడబిడ్డలు లేరా?. చట్టాలను బంధించడం వల్లే మహిళలకు అన్యాయం జరుగుతోంది. చెట్లు నరికే వాళ్లకు, అత్యాచారాలకు పాల్పడే వారికి పతనం మొదలైంది. ఏ ఆశ లేకుండా ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని నేను. సామాన్యుడికైనా, ఫ్యాక్షన్ నాయకుడికైనా చావు ఒక్కటే. ఓట్ల కోసం కులాలకు, మతాలకు వంతపాడే వ్యక్తిని కాదు.
- పవన్ కల్యాణ్
ఇదీ చదవండి:రైల్వే కోడూరులో పవన్‌కు ఘనస్వాగతం