రోజూ మనం నడిచే రోడ్డు మీద... ఒళ్లంతా గాయాలతో ఎవరూ పట్టించుకోక బాధపడుతున్న వారు, నా అన్నవారు లేక అనాథలుగా మృతిచెందిన వారు, రక్తం సకాలంలో అందక చనిపోతున్న వారు, గుక్కెడు నీరు, ఆహారం లేక డొక్కలు ఎండిన పశువులు ఇలా ఎన్నో సంఘటనలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఎంత మందిని కదిలిస్తాయంటే మాత్రం సమాధానం దొరకదు. ఓ యువకుడు మాత్రం ఇవన్నీ చూసి చలించిపోయాడు. తనతో పాటు మరికొంతమందిని కదిలేలా చేశాడు.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన సేపూరి మహేశ్.... సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా మారాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ యువకుడు... మానవసేవ చేయడమే లక్ష్యంగా మంచి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అతని తల్లికి పక్షవాతం వచ్చింది. అనారోగ్యానికి గురైన తన తల్లికి ఆసుపత్రిలో దగ్గరుండి సపర్యలు చేశాడు. అదే సమయంలో జబ్బుతో బాధపడే అనాథల అవస్థలు ఎలా ఉంటాయో కళ్లారా చూశాడు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలకే పూర్తి సమయం వెచ్చిస్తున్నాడు. మహేష్ మొదలుపెట్టిన ఈ సేవా యజ్ఞానికి.... అతని తండ్రి పూర్తిస్థాయిలో అండగా నిలబడ్డారు. అలాగే మరికొందరు యువకులూ తోడయ్యారు.
అభాగ్యులకు అండగా
మహేశ్ మరికొందరు యువకులతో కలసి రాజీవ సేవా సమితి ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన రోగాలతో బాధపడుతున్న వారిని చేరదీసి వారికి వైద్యసేవలు అందించి సపర్యలు చేస్తారు ఈ బృంద సభ్యులు. అలాగే అనాథ మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిపిస్తున్నారు. అంతేకాకుండా ఏ జీవి మృతి చెందినా సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు రక్తం అవసరం అయితే ముందుగా మహేశ్ సారథ్యం వహిస్తున్న రాజీవ సంస్థకే ఫోన్ వస్తుంది.
2018లో 800 మందితో రక్తదానం చేయించింది ఈ సేవా సంస్థ. మరోవైపు ప్రతి మంగళవారం, శనివారం మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసి.... రోడ్డు పక్కన ఉండే పశువుల కడుపు నింపుతున్నారు. అలాగే శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆటోలో తీసుకెళ్లి... రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద అనాథలకు అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు అవసరమైన వస్తువులను జబీవుల్లా అనే ఆటో డ్రైవర్ ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్తుంటారు.
తండ్రి చేయూత
మహేశ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన ఆయన తండ్రి ధర్మవరం పట్టణంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని రాజీవ సేవా సమితికి ఇచ్చేశారు. ఆ స్థలంలో అనాథాశ్రమం నిర్మించాలని ఆలోచన చేసిన మహేశ్‌కు తొలి విరాళంగా ఆయన తండ్రి...15 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు.
తమ వంతుగా..
మహేశ్ మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు రెండున్నరేళ్లలోనే ధర్మవరం పట్టణంలో అందరి దృష్టికి వెళ్లాయి. చాలా మంది తమ పిల్లల జన్మదినం రోజున రాజీవ సంస్థ ద్వారా నిరుపేదలకు ఆహారం వితరణ చేస్తున్నారు. మహేశ్ మిత్రులు నిర్మిస్తున్న అనాథాశ్రమ నిర్మాణానికి తమ వంతుగా ఆర్థిక సహాయం చేస్తామంటూ ధర్మవరంలో అనేక మంది ముందుకు వచ్చి నిర్మాణ సామగ్రిని అందిస్తున్నారు.
ఇదీ చదవండి: