ఒలింపిక్స్ నిర్వహించాలంటే ప్రధానమైన స్టేడియం ఒకటి కావాలి.. ఇందులోనే ప్రారంభోత్సవం, ముగింపోత్సవాలతో పాటు ముఖ్యమైన ఈవెంట్లు జరుగుతాయి. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్ కోసం టోక్యో కూడా తన ప్రధాన స్టేడియాన్ని సిద్ధం చేసేసింది. ఇటీవలే ఈ స్టేడియాన్ని ఘనంగా ఆరంభించారు. ఈ మైదానానికి సంబంధించిన ఫొటోలు తాజాగా విడుదల చేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు.

ఒకేసారి 68వేలమంది...
దాదాపు 68 వేల మంది కూర్చొని ఆటలను వీక్షించే వీలున్న ఈ క్రీడా వేదికను ప్రముఖ జపాన్ రూపశిల్పి కెంగో కుమా డిజైన్ చేశాడు. ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్ కూడా ఇక్కడే జరగనున్నాయి. దీని నిర్మాణం 2016 డిసెంబర్‌లో ఆరంభం కాగా.. మొదట బ్రిటన్ రూపశిల్పి జహా హజీద్ డిజైనింగ్ ఆరంభించాడు. ఆ తర్వాత ఖర్చు తగ్గించుకునేందుకు డిజైన్‌లో మార్పులు చేశారు. ఫలితంగా హజీద్ స్థానంలో కెంగో కుమాకు బాధ్యతలు అప్పగించారు.

10 వేల కోట్లతో నిర్మాణం...
ఈ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ స్టేడియం వేదికగా మొదట 2019 రగ్బీ ప్రపంచకప్ నిర్వహించాలనుకున్నా పనులు ఆలస్యం కావడంతో కుదరలేదు. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ స్టేడియంలో ఒలింపిక్స్ కన్నా ముందు ఎంపరర్స్ కప్ సాకర్ టోర్నీని నిర్వహిస్తున్నారు.



ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: బాలీవుడ్ బాలనటుడు ముంబయి సొంతం