16 నెలలు జైలులో ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారని భాజపా ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై సుజనాచౌదరి ఈ మేరకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తనపై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి రాసిన లేఖను నెలన్నర తరువాత రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోం శాఖకు పంపిందని వెల్లడించారు. దేశంలో ఏ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాసినా సంబంధిత శాఖకు పంపిస్తారని అన్నారు.
ఇప్పటివరకు నా మీద ఏ విధమైన ఆరోపణలు, ఫిర్యాదులు ఎవరూ చేయలేదు. నాపై ఏ విధమైన కేసులు లేవు. నా బిజినెస్ కెరియర్, నా పొలిటికల్ కెరియర్ తెరిచిన పుస్తకాలు. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్ పట్టుకుని.. నా ప్రతిష్ఠ దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చేస్తున్న మరొక చిల్లర ప్రయత్నమే ఇది.
- సుజనా చౌదరి
వారం వారం కోర్టు మెట్లెక్కుతూ ఎప్పుడు శిక్ష పడుతుందేమోనని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న విజయసాయిరెడ్డి ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సుజనా హితవు పలికారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగే అంశాలపై దృష్టి పెడితే మంచిదని సూచించారు.
ఇదీ చదవండి: సచివాలయం పూర్తిగా విశాఖలో పెడితే ఒప్పుకోం: టీజీ వెంకటేశ్