కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని... మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడుతున్నట్లు గల్లా జయదేవ్ చెప్పారు. ‘ఐదేళ్లలో రాష్ట్రానికి 600 అవార్డులు కేంద్రం నుంచి మనకు వచ్చాయి. అన్ని ప్రభుత్వ శాఖలకు మన గొప్పదనం తెలుసు’ అని గల్లా పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి నిధులు వెచ్చించాం. విశాఖ, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాల్లోనూ నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేశాం’ అని ఆయన తెలిపారు. రాజధానిలో అనుసంధాన రహదారులకే రూ.9వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి అనేది ఆర్థికపరమైన వెంచర్స్, రాజధాని కేంద్రంలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. ‘ఇప్పుడు మనం వెనకబడిపోతున్నాం... అభివృద్ధికి భవిష్యత్తు ఉండాలంటే మనకు రాజధాని ఉండాలి’ అని పేర్కొన్నారు.
వైకాపా పాలనలో పొరుగు రాష్ట్రాలకు ఇసుక: ఆలపాటి
వైకాపా అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని, కొత్త ఇసుక విధానం ఆ పార్టీ నేతల జేబులు నింపుతోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ‘మన రాష్ట్రంలో దొరకని ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. తెదేపా హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 ఉంటే... ఇప్పుడు రూ.7వేల నుంచి రూ.10వేలు వెచ్చించాల్సి వస్తోంది. లారీ ఇసుక రూ.40వేల నుంచి రూ.లక్షకు అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 25న ప్రదర్శనలు నిర్వహించనున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: 'రాజధాని తరలింపుతో ప్రయోజనమేంటి?'