అమరావతే రాజధాని అనుకున్నాం.. ఊళ్లల్లో పొలాలు, ఇళ్లు అమ్మేసి.. రుణాలు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్నాం.. ఇప్పుడు వాటిని అద్దెకు ఎవరు తీసుకుంటారు? నెలనెలా వాయిదాలు కట్టుకునే మా పరిస్థితి ఏమిటి? పిల్లల చదువులెలా? నెలకు రూ.12వేల జీతం తీసుకునే పొరుగుసేవల ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? కుటుంబసభ్యుల వైద్య సేవలు ఎక్కడ వెదుక్కోవాలి? అని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు ప్రతిపాదనతో వారం రోజులుగా నిద్రకు దూరమయ్యామని, మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలోనూ ఇంత ఇబ్బంది పడలేదని వివరించారు. ‘‘రాజధాని విషయంలో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒక రాజకీయ పార్టీపై మరో పార్టీకి కక్ష ఉంటే వాళ్లూ వాళ్లూ చూసుకోవాలి. మిగిలిన అంశాలతో ముడిపెట్టకూడదు...’’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం సచివాలయంలో అప్సా (ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్) సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వద్ద పలువురు ఉద్యోగులు తమ ఇబ్బందులను వివరించారు. రాజధాని తరలింపుపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీచదవండి