రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ సహా.. కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల్ని అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ నెల6న తొలిసారిగా భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం కానుంది. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించింది. మరో వైపు బీసీజీ తన నివేదికను శుక్రవారం సీఎంకు అందజేస్తుంది. ఈ రెండు కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి... మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
రాజధాని అంశంపై రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, సుచరిత, మోపిదేవి, కొడాలి నాని, పేర్ని నాని, సీఎం జగన్ ముఖ్య సలహాదారు, డీజీపీ, సీసీఎల్‌ఏ, పురపాలక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హైపవర్ కమిటీ కన్వీనర్‌గా సీఎస్ నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు.