ETV Bharat / city

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు తెదేపా నిర్ణయం

author img

By

Published : Jan 27, 2020, 5:06 AM IST

Updated : Jan 27, 2020, 7:39 AM IST

శాసన సభ అజెండాయే రాజ్యాంగ విరుద్ధమని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు.... నేటి సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక సభ గురించి మరోసభలో చర్చించడం పార్టమెంటరీ విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ మరో ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.

tdp decided to not attend for assembly sessions today
tdp decided to not attend for assembly sessions today

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు తెదేపా నిర్ణయం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం తప్పు మీద తప్పులు చేస్తోందన్న చంద్రబాబు... మండలిలో మెజారిటి లేకపోయినా తాను చెప్పినట్టే జరగాలని ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దురుద్దేశాలతోనే ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కున్నారని మండిపడ్డారు. ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అందుకే హాజరవ్వం...

గతంలో అణు ఒప్పందం ఓటింగ్ వేళ అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి తెదేపా ఎంపీలకు ఎన్నో ప్రలోభాలు పెట్టారని.... స్వయంగా లోక్ సభ గ్యాలరీలో వైఎస్ కూర్చుని ఎంపీల కొనుగోళ్లకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. తనకు డబ్బు లేకపోయినా నైతికత ఉందని చలపతిరావు అప్పట్లో ధీటుగా జవాబిచ్చి పార్టీ కోసం ధృఢంగా నిలబడ్డారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని ఎమ్మెల్సీలు చూపించారంటూ.... ఏ పరిస్థితుల్లో పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చామో వివరించారు. తమపై జరుగుతున్న దౌర్జన్యాలను బీటీ నాయుడు, బుద్దా నాగ జగదీశ్వర రావు సమావేశంలో వివరించారు. మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందన్న చంద్రబాబు... ఇదే స్ఫూర్తిని ఇకపైనా చూపాలని కోరారు. పార్టీ అధినేతగా తాను సభ్యులకు అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శాసనమండలి గురించి ఇప్పటికే శాసనసభలో చర్చించడమే ఒక ఉల్లంఘన కాగా ఇవాళ మళ్లీ చర్చిస్తామని అజెండాలో పొందుపరచడం రాజ్యాంగ స్ఫూర్తి కాదన్నారు. అందువల్లే శాసనసభ సమావేశాలకు హాజరుకాబోమని తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

రద్దుకు రెండేళ్లు

మండలి రద్దు ముఖ్యమంత్రి జగన్ అనుకున్నంత సులభం కాదని తెదేపా నేతలు తెలిపారు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోబోదని... ఇప్పటికే మండలి రద్దు, పునరుద్ధరణకు వివిధ రాష్ట్రాల తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయని ఈ సమావేశంలో తెదేపా సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు. కేంద్రం అంగీకరించినా కనీసం రెండేళ్లు పడుతుందనే యనమల అభిప్రాయపడ్డారు. బిల్లుల కోసం కక్షతో మండలిని రద్దు చేస్తే వైకాపాకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఈ సమావేశంలో తెదేపా నేతలు చర్చించారు. మండలి పునరుద్ధరణకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మూడేళ్లు పట్టిందని తెదేపా నేతలు గుర్తుచేశారు.

నేడు మళ్లీ శాసనసభాపక్షం భేటీ
శాసన మండలిని రద్దుకు సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు 9.30 గంటలకు తెదేపా శాసనసభాపక్షం మరోమారు భేటీ కానుంది.


ఇదీ చదవండి:నేడు కేబినెట్ భేటీ... మండలి రద్దుపై నిర్ణయం!

sample description
Last Updated :Jan 27, 2020, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.