సంతానం లేని దంపతులకు ఊరటనిచ్చేలా సరోగసీ(అద్దె గర్భం) విధానం త్వరలోనే సరళతరం కానుంది. ఇకపై గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. ఈ మేరకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సరోగసీ(నియంత్రణ) బిల్లు-2019లో 15 భారీ మార్పులను ప్రతిపాదించింది.
దేశంలో సరోగసీపై అనేక ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ విధానంలో కఠిన నిబంధనలు తీసుకొస్తూ సరోగసీ(నియంత్రణ) బిల్లు- 2019ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం భారతీయ దంపతులు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనాలంటే వారికి చట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండాలి. అంతేగాక గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సదరు దంపతులకు సమీప బంధువై ఉండాలి. ఇలాంటి అనేక షరతులతో ఈ బిల్లును తీసుకొచ్చింది.
15 మార్పులతో ప్రతిపాదన...
గతేడాది లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభకు చేరింది. అయితే ఈ బిల్లును నిపుణుల కమిటీకి పంపించాలని పెద్దలసభలో నిర్ణయించి.. నవంబరు 21న ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశాలు జరిపింది. పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అనంతరం బిల్లులో 15 ప్రధాన మార్పులను ప్రతిపాదించింది.
‘సమీప బంధువు’ అనే నిబంధన కారణంగా గర్భాన్ని అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని, దీనివల్ల పిల్లలు లేని దంపతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని కమిటీ అభిప్రాయపడింది. అందుకే ఈ నిబంధనను బిల్లు నుంచి తొలగించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఏ మహిళ అయినా తన ఇష్టపూర్వకంగా సరోగేట్ తల్లిగా మారొచ్చని ప్రతిపాదనలు చేసింది.
సరోగసీ మహిళ బీమా కవరేజీ 36 నెలలు...
ఇక వివాహం జరిగిన ఐదేళ్లు, ఆ తర్వాత కూడా పిల్లలు కలగని దంపతులు మాత్రమే సరోగసీ విధానాన్ని ఎంచుకోవాలనే నిబంధనను కూడా తీసేయాలని ప్రతిపాదించినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల కోసం దంపతులు ఐదేళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ సమయమని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేగాక, భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న 35 నుంచి 45 ఏళ్ల ఒంటరి మహిళలు కూడా సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చని సూచించింది. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు బీమా కవరేజీని 16 నెలల నుంచి 36 నెలలకు పెంచాలని ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనలతో కూడిన నివేదికను సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం రాజ్యసభకు సమర్పించారు.
ఇదీ చూడండి: రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు