వరదలో చిక్కుకున్న ఆవులు.. చాకచక్యంగా కాపాడిన యువకులు
🎬 Watch Now: Feature Video
జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ఆవులను స్థానిక యువకులు కాపాడారు. భీకర వరదలు కారణంగా రుమ్షీ కాలువను దాటలేక ఇబ్బంది పడుతున్న ఆవులను గమనించిన స్థానిక యువకులు.. వాటిని బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సహాయ బృందాల కోసం ఎదురుచూడకుండా వాటిని కాపాడినందుకు స్థానికులు వారిని ప్రశంసిస్తున్నారు.
జిల్లాలోని రహ్మో ప్రాంతంలో వరద తీవత్ర కారణంగా రుమ్షీ కాలువ మధ్యలో ఆవులు చిక్కుకున్నాయి. అవి కాలువ దాటేందుకు ప్రయత్నించినప్పటికీ.. నీటి ఉద్ధృతి కారణంగా బయటకు రాలేక ఇబ్బంది పడ్డాయి. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానిక యువకులు వాటిని గమనించారు. రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. వాటిని జాగత్రగా బయటకు తీసుకొచ్చి రక్షించారు.
"సహాయం కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం కోసం ఎదురు చూశాం. వారు రాకపోయే సరికి మేమే వాటిని కాపాడటం కోసం రంగంలోకి దిగాం. చివరికి ఆవులను కాలువను దాటించాం" అని స్థానిక యువకుడు తెలిపాడు. ఈ వరదల కారణంగా రుమ్షీ కాలువ చుట్టుపక్కల ఉన్న రత్నిపొరా, పింగాల్నా, బదిబాగ్ ప్రాంతాలు నీట మునిగాయి.