పెడల్ ఎక్సర్‌సైజ్ మినీ బైక్
ఫిట్‌నెస్‌లో భాగంగా సైక్లింగ్ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఈ క్రమంలో అందరి దగ్గరా సైకిల్ ఉండచ్చు.. ఉండకపోవచ్చు..! ఒకవేళ ఉన్నా కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు వ్యాయామం మానుకోవాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే, అది కూడా కూర్చున్న చోటే ఎంచక్కా సైక్లింగ్ చేయచ్చు. అదెలా అంటే.. ‘పెడల్ ఎక్సర్‌సైజ్ మినీ బైక్’తో!

ఫొటోలో చూపించినట్లుగా ఒక బేస్‌కి మధ్యలో ఇరువైపులా సైకిల్ పెడల్స్ అమర్చినట్లుగా ఉంటుందీ గ్యాడ్జెట్స్. ఒక సోఫాలో లేదంటే కుర్చీలో కూర్చొని, దీన్ని కాళ్ల దగ్గర అమర్చుకొని సైక్లింగ్ చేయడమే! తద్వారా కాళ్లు, తొడల్లోని కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. అంతేకాదు.. చేతులకు వ్యాయామం అందించాలన్నా, భుజాల్లోని కండరాలు దృఢంగా మారాలన్నా కాళ్లకు బదులుగా చేతులను ఉపయోగిస్తూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి ముందు భాగంలో ఉన్న ఎల్‌సీడీ మానిటర్‌పై ఉన్న ఎరుపు రంగు బటన్‌ని నొక్కితే మనం ఎన్నిసార్లు సైక్లింగ్ చేశాం, ఎంత సమయంలో చేశామనేది కూడా దానిపై నమోదవుతుంది. దాన్ని బట్టి క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవచ్చు. ఇక ఈ పరికరంతో అవసరం తీరిపోయాక దాన్ని మడిచి ఏదైనా షెల్ఫ్‌లో పెట్టేయచ్చు. ఇలా ఎంతో అనువుగా ఉండే ఈ మినీ గ్యాడ్జెట్ నాణ్యతను బట్టి దీని ధర రూ.1,499గా ఉంది.
అబ్డామినల్ రోలర్
పొట్ట భాగంలో కాస్త కొవ్వు పేరుకుపోయినా ఒప్పుకోం.. ప్రసవానంతరం పొట్టను తగ్గించుకోవడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటాం. ఇలా పొట్టను ఫ్లాట్‌గా మార్చి, అక్కడి కండరాల్ని దృఢంగా చేసే మినీ గ్యాడ్జెట్ ‘అబ్డామినల్ రోలర్’.

ఫొటోలో చూపించినట్లుగా ఒక చక్రంలా ఉండి.. ఇరువైపులా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటాయి. ప్లాంక్ పొజిషన్‌లో బోర్లా పడుకొని రెండు చేతులతో హ్యాండిల్స్ పట్టుకొని నెమ్మదిగా ముందుకూ, వెనక్కి అంటూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పొట్ట కండరాలపై ఒత్తిడి పడి అవి దృఢంగా మారతాయి.. అంతేకాదు.. అక్కడ పేరుకుపోయిన అదనపు కొవ్వులు కూడా కరిగిపోతాయి. ఇలా పొట్టను ఫ్లాట్‌గా మార్చుకోవడానికి ఉపయోగించే ఈ మినీ పరికరంతో పని పూర్తయ్యాక దీన్ని ఎక్కడైనా ఈజీగా అమర్చచ్చు. అలాగే ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్లచ్చు. దీని నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 249 నుంచి రూ. 869 వరకు ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్లిమ్మింగ్ వాకర్

ఫొటోలో చూపించినట్లుగా ఒక చిన్న పరికరంలా ఉండే దీనిపై రెండు కాళ్లు అమర్చడానికి వీలుగా ఒక పెడల్ లాంటిది ఉంటుంది. హాయిగా నేలపై లేదంటే బెడ్‌పై పడుకొని.. రెండు చీలమండల్ని దానిపై అమర్చి.. ప్లగ్‌ని సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఆ పెడల్ లాంటిది అటూ ఇటూ కదులుతుంటుంది. ఈ వైబ్రేషన్ వల్ల కాళ్లతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ కదలికలొస్తాయి. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగవుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇది విద్యుత్ పరికరం కాబట్టి వాడితే ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహం కొంతమందిలో ఉండచ్చు. అలాంటి వారు వాడే ముందు ఓసారి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. దీని నాణ్యతను బట్టి ధర రూ. 1,200 నుంచి రూ. 3,195 వరకు ఉంటుంది.
మల్టీఫంక్షనల్ మజిల్ ట్రైనింగ్ టూల్
కాళ్లు, చేతులు, భుజాలు, తొడలు, పిరుదులు.. ఇలా ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా శరీరాకృతి మొత్తం దెబ్బ తింటుంది. అందుకే అమ్మాయిలంతా ఆయా భాగాలను టోన్ చేసుకోవడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇకపై అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే సులభంగా శరీరం మొత్తాన్ని నాజూగ్గా మార్చుకోవచ్చు. అదెలా సాధ్యమంటే.. ‘మల్టీఫంక్షనల్ మజిల్ ట్రైనింగ్ టూల్’తో!

ఫొటోలో చూపించినట్లుగా ‘వి’ ఆకృతిలో ఉండే పరికరంలా ఉంటుందిది. దీనికి మధ్యభాగంలో ఒక స్ప్రింగ్ లాంటిది అమరి ఉంటుంది. దాని సహాయంతోనే ఈ టూల్‌ని ప్రెస్ చేయచ్చు. ఉదాహరణకు.. తొడల వద్ద కొవ్వు కరిగించుకోవాలంటే రెండు తొడల మధ్యలో దీన్ని ఉంచి.. ప్రెస్ చేస్తూ, వదులుతూ ఉండాలి. ఇలా కాసేపు రిపీట్ చేయాలి. ఏ భాగంలో కొవ్వు కరిగించుకోవాలన్నా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఇలా దీనివల్ల నాజూగ్గా మారడంతో పాటు ఆయా భాగాల్లో కండరాలు దృఢంగా మారతాయి. రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది. ఈ మినీ టూల్ నాణ్యతను బట్టి ధర రూ.299 నుంచి రూ.598 వరకు ఉంటుంది.
ఫోమ్ రోలర్
వ్యాయామం చేసిన తర్వాత ఒక్కోసారి ఆయా భాగాల్లో కండరాలు పట్టేస్తుంటాయి. తద్వారా విపరీతమైన నొప్పి వస్తుంటుంది.. అలాంటప్పుడు ఆ క్రీమ్, ఈ ఆయింట్‌మెంట్ అంటూ రాయడం కాకుండా ‘ఫోమ్ రోలర్’ని ఉపయోగించండి.. త్వరగా ఉపశమనం పొందచ్చు.

ఫొటోలో చూపించినట్లుగా బొడిపెల్లాంటి రోలర్‌లా ఉంటుందిది. మనకు ఎక్కడ నొప్పిగా అనిపించినా ఆ భాగం దీనిపై మోపేలా పడుకొని ముందుకూ, వెనక్కి అంటుండాలి. ఉదాహరణకు.. మనకు నడుంనొప్పి వచ్చిందనుకోండి.. నడుం భాగాన్ని రోలర్‌పై ఆనేలా వెల్లకిలా పడుకొని.. ముందుకు, వెనక్కి మసాజ్ చేసినట్లుగా అంటుండాలి. తద్వారా రోలర్‌పై ఉన్న బొడిపెలు ఆయా భాగాలకు చక్కటి మసాజ్‌ని అందిస్తాయి. అలాగే అక్కడ రక్తప్రసరణ కూడా సాఫీగా జరిగి నొప్పి నుంచి త్వరిత ఉపశమనం పొందచ్చు. ఇలా ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ రోలర్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 499 నుంచి రూ. 699 వరకు ఉంటుంది.
చూశారుగా.. ఈ మినీ ఫిట్‌నెస్ గ్యాడ్జెట్స్ ఎంత అనువుగా ఉన్నాయో! అయితే వీటిని వాడే క్రమంలో ఏవైనా సందేహాలు ఎదురైనా, అసౌకర్యంగా అనిపించినా నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మాత్రం మరవద్దు.