‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’(ఐసీఏఆర్) ప్రాజెక్టులో భాగంగా ఆహార నాణ్యత ప్రయోగశాలలో ప్రతి ఆహార పంటలోని పోషక విలువలపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నివేదిక తయారు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తిమీర మీద పరిశోధన చేపట్టి అనేక విషయాలను గుర్తించారు. దీనిని నిత్యం ఆహారంలో వాడటం వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు పలు రోగాల నియంత్రణకు ఉపకరిస్తుందని వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ ఈటీవీ భారత్కు చెప్పారు.
కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుందని తెలిపారు. మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం శరీరానికి అందుతాయని వివరించారు. ఇందులో లభించే విటమిన్ కె.. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు, గాయాలైనప్పుడు త్వరగా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ‘‘ఆర్ధరైటిస్ వంటి వ్యాధులకు విరుగుడుగా పనిచేయడంతో పాటు కాలేయాన్ని మెరుగుపరుస్తుంది. అతిసారాన్ని నివారిస్తుంది."
'విటమిన్ ఏ, సీ శరీరానికి అందడంతోపాటు ఎండోక్రైన్ గ్రంథులలో ఇన్సులిన్ స్రావం పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం తదితర ప్రయోజనాలు అందుతాయి. జీర్ణక్రియకు అవసరమైన బోర్నియోల్, లినయోల్‌లు కొత్తిమీరలో పుష్కలం. ఈ ఆకులలో కొలెస్ట్రాల్ ఉండదు. పీచు పదార్థం ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొవ్వులను పెంచడానికి దోహదపడుతుంది. నోటిలో, నాలుకపై వచ్చే పూతలను నయం చేసే యాంటీ సెప్టిక్ లక్షణాలు ఈ ఆకుల సొంతం. నోటి దుర్వాసననూ దూరం చేస్తుంది' అని జగదీశ్వర్ తెలిపారు.
ఇదీ చదవండి: జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసిటర్!