సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బకాయిగూడెంలో.. కీత వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. తన 28 గుంటల భూమిని 2018లో... మేడ్చల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకట సూర్యనారాయణకు 8 లక్షల 40 వేలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. మొదటి విడతగా.. 4 లక్షల 20 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు.
గ్రామ పెద్దల సమక్షంలో.. మిగతా 4 లక్షల 20వేలు చెల్లించేందుకు వెంకట సూర్యనారాయణ 6 నెలల గడువు కోరాడు. పెద్దమనుషుల సమక్షంలో గడువు పొడిగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. అయినా ఇంతవరకు చెల్లించలేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. చెల్లించిన డబ్బులు తిరిగిస్తా... తన భూమి తనకు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోనందునే ఇలా చేసినట్లు తెలిపాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా వెంకటేశ్వర్లు ట్యాంకు దిగి కిందికి వచ్చాడు.
ఇదీ చూడండి : శబరిమల, రఫేల్ కేసులపై రేపు సుప్రీం తీర్పు