సిద్దిపేట జిల్లాలోని అడవుల్లో డ్రోన్ ద్వారా విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి హరీశ్ రావు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కలిసి ప్రారంభించారు. అడవుల్లో మనుషులు వెళ్లలేని చోటకు డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ ను తీసుకెళ్లి నాటుతున్నట్లు ఆయన వివరించారు.
సీడ్ బాల్స్ ద్వారా చెట్లను పెంచడం మంచి ఆలోచన అని వనజీవి రామయ్య అన్నారు. లాటరీ టికెట్ కొంటే లాభం రాకపోవచ్చు గానీ మొక్కను నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా ఎంతో లాభం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మానవ మనుగడ కొనసాగాలంటే.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా మార్చాలని రామయ్య తెలిపారు.
ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్లేనని.. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీడ్ బాల్స్ తో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యమిచ్చిన్నట్లు మంత్రి పేర్కొన్నారు.