కరోనా కష్టకాలంలో ఫుట్‌పాత్‌లపై కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బతుకు నడిపిస్తున్న తమపై సిద్దిపేట మున్సిపల్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానుషమని పలువురు కూరగాయల వ్యాపారులు వాపోయారు. రాత్రి వరకు వ్యాపారం చేసుకుని అక్కడే ఉంచిన కూరగాయలను రాత్రికి రాత్రి మున్సిపల్ ఆఫీస్‌కు తరలించడం హేయమైన చర్య అన్నారు. ఆగ్రహించిన వ్యాపారులు, రైతులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన కొంతమంది రైతులు ఇప్పటికే తమకు నిలువనీడ లేకుండా పోయిందన్నారు. ఉన్న ఒక్క ఆధారం అయిన కూరగాయల వ్యాపారాన్నీ మున్సిపల్ అధికారులు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హైస్కూల్ ఎదుట గల ఫుట్‌పాత్‌లపై కరోనా లాక్డౌన్ సమయం నుంచి కొంతమంది రైతులు, వ్యాపారులు.. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులాగే వ్యాపారం ముగిసిన అనంతరం కూరగాయలను, సంచులను, ఇతర సామాగ్రిని అక్కడే పెట్టి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలు కొనసాగించకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ సిబ్బంది మొత్తం కూరగాయలను రాత్రి మున్సిపల్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే కూరగాయలను తమవెంట తీసుకెళ్లేవారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ తీరు మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు