రాష్ట్రంలో మైనింగ్ అనుమతుల జారీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా క్వారీలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. ప్రజల జీవన విధానంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో క్వారీలకు అనుమతులు జారీ అవుతుండగా.. వేలాది ఎకరాల్లో మైనింగ్ జరుగుతోంది. దీంతో గుట్టలపైఉన్న ఖనిజ సంపద కరిగిపోతోంది. పచ్చదనం కనుమరుగవుతోంది. కుంటలు, చెరువులు మాయమవుతున్నాయి. మూగజీవాలు ఆవాసాలను కోల్పోతున్నాయి. పేలుళ్లతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఇంతటి నష్టం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.గనులు, థర్మల్ ప్రాజెక్టులు, భారీ నివాస సముదాయాలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ప్రాజెక్టు విస్తీర్ణం 5 హెక్టార్లు దాటితే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. అవేమి లేకుండానే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకత వచ్చినా కొన్ని చోట్ల వెనక్కి తగ్గడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కంకర, ఇసుక, క్వార్ట్జ్, గ్రానైట్ తదితరాలను తవ్వి తీయడానికి రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ), భూగర్భ గనుల (మైనింగ్) శాఖ నుంచి లీజు తీసుకోవాలి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నుంచి కాన్సెంట్ ఫర్ ఆపరేషన్(సీఎఫ్‌వో), కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్(సీఎఫ్‌ఈ) అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీ(ఎస్‌ఈఏసీ) పరిశీలించి మైనింగ్ అనుమతి ఇవ్వాలా, వద్దా అని సూచిస్తుంది. సామాజిక, పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(ఎస్‌ఈఐఏఏ) పరిశీలించి పర్యావరణ అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది. ఎస్‌ఈఏసీ, ఎస్‌ఈఐఏఏకి మినహా మిగిలిన శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అయితే కొన్ని శాఖలు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే మైనింగ్‌కు ఆమోదం తెలుపుతున్నాయి. అవినీతి కారణంగానే ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తవ్వకాలు మొదలయ్యాక నిబంధనలు పాటించని సంస్థలపై పీసీబీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
* తవ్వకాలతో రంగారెడ్డి జిల్లా బండరావిరాలలోని పుల్చర్లకుంట కనుమరుగవుతోంది. కంబాలకుంట నామరూపాలు కోల్పోతోంది. హయత్‌నగర్ మండలం కుంట్లూరులో మైనింగ్‌తో అటవీ ప్రాంతంపై ప్రభావం పడుతోంది.
* మైనింగ్‌తో ఇళ్లలోకి దుమ్ము చేరి సామగ్రి, ఇతర వస్తువులు చెడిపోతున్నాయని, పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్, యాదాద్రి-భువనగిరి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ అక్కడ చెట్లు నాటాలి, బోర్లు వేయాలి అన్న నిబంధనలతో పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు.
ఎడాపెడా ఇచ్చేస్తాం
* 2020లో పర్యావరణ అనుమతి లభించినవి: 563. అందులో మైనింగ్ (బొగ్గు మినహా)వి: 259
* 2021 తొలి ఆర్నెల్లలో తవ్వకాలకు అనుమతిచ్చినవి: 722. వీటిలో గనుల క్వారీలు: 273
* కొత్తగా మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తులు: 6,575
* వాటికి అనుమతి అభిస్తే తవ్వకాలు జరిగే విస్తీర్ణం: 32,875 ఎకరాలు
పేలుళ్లతో భూమి అదురుతోంది. ఇళ్లు నెర్రెలు బారుతున్నాయి. ఇల్లంతా కదులుతున్నట్లు ఇనిపిస్తోంది. రాత్రింబవళ్లు వచ్చే పెద్దపెద్ద శబ్దాలతో నిద్ర కూడా కరవైంది.
- రాజమ్మ, నాగలక్ష్మి, లక్డారం
మైనింగ్, లారీల రాకపోకలతో ఇళ్లలోకి దుమ్ము చేరుతోంది. రోజుకు నాలుగైదుసార్లు వంటపాత్రలను కడగాల్సి వస్తోంది. వాయుకాలుష్యం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
- జ్యోతి, వెంకటమ్మ, లక్డారం గేట్, సంగారెడ్డి జిల్లా
ఇదీ చూడండి: