రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. వైద్య పరికరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని అధికారులను ఆదశించారు. తిప్పాపూర్ లో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత వైద్యాధికారులు, కాంట్రాక్టర్ లతో కలిసి పరిశీలించారు.
ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన మొదట్లో 12 ఐసీయూ పడకలు, 10 జనరల్ పడకలు అందుబాటులో ఉండనున్నాయని కలెక్టర్ వెల్లడించారు. విద్యుత్ కనెక్షన్ పూర్తయిందని… అంతర్గత పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిబంధనల మేరకు ఫైర్ సిలిండర్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య పరికరాలు, కావాలసిన సామగ్రి వచ్చిన వెంటనే ఆసుపత్రిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.