ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో నిరుపేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను మరిపించే విధంగా డబుల్ బెడ్రూం ఇళ్లను తీర్చిదిద్దారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద దాదాపు 30ఎకరాల స్థలంలో 83కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేశారు. నవతేజ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నాణ్యతలో రాజీపడకుండా ఇళ్లను నిర్మించారు. ఇళ్లను 1320మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సొంతింటి తాళాలు అందించనున్నారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించిన కేసీఆర్ నగర్ ప్రాంగణంలోనే పాఠశాల,అంగన్‌వాడీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని నిర్మాణసంస్థ అధికారులు చెబుతున్నారు.
నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్న సీఎం
ఉపాధి శిక్షణలో భాగంగా అంతర్జాతీయ స్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో కొత్తభవనం రూపుదిద్దుకుంది. దాదాపుగా 5ఎకరాల్లో అయిదంతస్తుల పక్కాభవనాన్ని 27.77కోట్లతో నిర్మించారు. 105గదులు 5ప్రయోగశాలలు, 400మంది విద్యార్థులకు సరిపోయే వసతిగృహ భవనాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం అద్దెభవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సీఎం ప్రారంభోత్సవం అనంతరం సొంత భవనంలోకి అడుగు పెట్టనుంది.
20ఎకరాల్లో మార్కెట్ యార్డు
రైతుల సౌకర్యార్ధం మార్కెట్ యార్డు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సర్దాపూర్‌లో 20ఎకరాల్లో 22కోట్ల రూపాయలతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మించారు. సిరిసిల్లకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్ అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రగుడు గ్రామం వద్ద దాదాపు 98ఎకరాల్లో 70 కోట్ల రూపాయలతో సమీకృత కలెక్టరేట్ భవనం ముస్తాబు అవుతోంది. రెండస్తులు నాలుగు బ్లాకుల్లో జిల్లా స్థాయి అధికారులకు సకల వసతులతో అందుబాటులోకి రానుంది.
ముఖ్యమంత్రి రాక కోసం రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలతో స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: KTR: 'గత పాలకులు మాటలు చెబితే.. కేసీఆర్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోంది'