పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వీడియో రికార్డ్ చేసి తన నియోజకవర్గ ప్రజలకు సందేశాన్ని పంపించారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే పరీక్షలు చేసుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే కరోనాను జయించి నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తానని రామగుండం ప్రజలకు తెలిపారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన పని లేదని.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలన్నారు.
రామగుండం మేయర్ అనిల్ కుమార్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆయన హోం క్వరంటైన్లో ఉన్నారని తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం మేయర్‌తోపాటు పాల్గొన్న తానూ కరోనా పరీక్షలు చేయించుకోవడం వల్ల పాజిటివ్ వచ్చిందన్నారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. తానూ కనబడుట లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. వారి కోసమే ఈ సందేశాన్ని పంపుతున్నట్లు చెప్పారు. కాగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడం వల్ల పలువురు ప్రజా ప్రతినిధులు, సింగరేణి అధికారులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్