జనాభా పెరుగుదలతో స్వచ్ఛమైన పాలకు డిమాండు విపరీతంగా పెరుగుతోంది. దీంతో అందరూ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ క్యాంప్, భూలక్ష్మీక్యాంప్ గ్రామాల వైపు చూస్తున్నారు. పూర్వం వ్యవసాయదారుల ఇళ్లల్లో గేదెలుండటం సాధారణం. సాగులో పశువుల వినియోగం తగ్గడం, చేసే కష్టానికి.. పాల ధరకు గిట్టుబాటు కాకపోవడంతో క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ గ్రామాలకు మూడుతరాలుగా పాడిపరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి మహిళలు నాణ్యమైన పాల ఉత్పత్తి కోసం ఎంతో శ్రమిస్తున్నారు.
లీటరు రూ.1తో మొదలు..
ఒక్కసారి ఆ గ్రామాలకు వెళ్లి చూస్తే ఇరుగుపొరుగుతో ముచ్చట్లు.. టీవీ సీరియళ్లు చూసే వారు కనిపించారు. ఉరుకులు, పరుగులతో తిరుగుతుంటారు. సాగులో పురుషులు శ్రమిస్తుంటే.. పాడిలో మహిళలు నిమగ్నమవుతారు. అంతలా కష్టపడితేనే సగం బోధన్ పట్టణం, కొంత భాగం నిజామాబాద్ నగరంలోని ప్రజల పాల అవసరాలు తీరేది. డిమాండు నేపథ్యంలో వ్యాపారులు ఈ గ్రామాలపై దృష్టి సారించారు. లీటరు రూ. 1 ఉన్నప్పుడు మొదలైన ఎగుమతి మూడు తరాలుగా కొనసాగుతూ నేడు ధర రూ.50కి చేరింది. నాలుగు గేదెలున్న ఓ కుటుంబం నెలకు రూ.60 వేలు ఆర్జిస్తారు. అందులో సగం నిర్వహణ ఖర్చులకు వెళుతుంది.
మహిళలకు ద్విచక్రవాహనాలు
పాడి రైతుల ఇళ్ల ఎదుట భార్యాభర్తలు ఇద్దరికి ద్విచక్రవాహనాలు కనిపిస్తాయి. పశు గ్రాసం తీసుకొచ్చేందుకు మహిళలు మోపెడ్‌లను ఉపయోగిస్తారు. లభ్యత ఆధారంగా 15 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంటారు. రెండు గేదెలకు కనీసంగా 50 కిలోల గడ్డిమోపులు రెండు తీసుకురావాల్సి ఉంటుంది. వాహనం నడపలేని వారు సైకిళ్లు, తలపై మోసుకొస్తారు.
ఒకరోజు పాల ఉత్పత్తి లీటర్లలో
సాలంపాడ్ క్యాంప్: 5 వేలు
భూలక్ష్మిక్యాంప్ : 2 వేలు
వీటితోనే సాగు పెట్టుబడి
2004 నుంచి పాడి నిర్వహణలో ఉన్నాను. ప్రస్తుతం ఐదు గేదెలు ఉన్నాయి. రోజూ 40 లీటర్ల పాలిస్తాయి. సొంత వ్యవసాయ భూమి లేదు. గేదెల గ్రాసం కోసం భూమి కౌలుకు తీసుకోవాల్సి వచ్చింది. సాగు చేయొచ్చని మొత్తం పదెకరాలు తీసుకున్నాం.
- సుధ, సాలంపాడ్‌క్యాంప్
జీవితంలో భాగమైంది
మాది వ్యవసాయ కుటుంబం. దానిపైనే ఆధారపడితే దిగుబడులు రానప్పుడు ఇబ్బందవుతుంది. అందుకే అనుబంధంగా పాడి నిర్వహిస్తున్నాం. తరతరాలుగా మా ఊరిలో పాల ఉత్పత్తి జరుగుతోంది. పాడి, పంటలు మినహా మాకు మరో ప్రపంచం లేదు.
- శిరీష, భూలక్ష్మిక్యాంప్